అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: మార్కులు తక్కువ వచ్చాయని, అనుకున్న గ్రేడ్ సాధించలేకపోయానని మనస్తాపం చెంది అమెరికాలో చదువుకుంటున్న ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నార్త్‌కరోలినా యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న శివకరన్(23) భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాలు.. నగరంలోని రామాంతపూర్‌కు చెందిన శివకరన్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. ప్రాథమిక విద్యను హఫ్సీగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో పూర్తి చేసిన శివకరన్.. ఇంటర్ మీడియట్ నారాయణ కళాశాలలో పూర్తిచేశాడు. అనంతరం మెదక్ జిల్లా ఎద్దుమైలారంలోని ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. విద్యాభ్యాసం అనంతరం పలు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిని కాదని ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.
నార్త్‌కరోలినా యూనివర్సిటీలో సీటు సంపాదించిన శివకరన్ ఆరు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. తరచు తల్లిదండ్రులతో చదువుకు సంబంధించిన విషయాలను ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన పరిక్ష ఫలితాల్లో తాను అనుకున్న గ్రేడ్ సాధించలేకపోవడంతో.. పాటు మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెందిన శివకరన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.