సాక్షి, హైదరాబాద్: అమెరికా, భారత్‌ల మధ్య పటిష్ట వాణిజ్య బంధానికి హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ కీలక పాత్ర పోషిస్తోందని వాషింగ్టన్‌లో అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వెల్లడించారు. హైదరాబాద్‌లో పెట్టుబడుల కోసం ఎన్నో అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు.
నానక్‌రాంగూడలో సుమారు రూ.2,800 కోట్ల భారీ వ్యయంతో నూతనంగా నిర్మించిన యూఎస్ కాన్సులేట్ భవనంలో ఈనెల 20 నుంచి ప్రారంభమైన కార్యకలాపాలను ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు.
భారత్‌లో అమెరికా పెట్టుబడులే కాకుండా భారత్ నుంచి అమెరికాలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గాను ఈ కొత్త కాన్సులేట్ బిల్డింగ్ ఎంతో దోహదపడుతుందని వివరించారు. అమెరికా ఫారెన్ పాలసీ బ్రీఫింగ్ లో అమెరికా ఫారెన్ పాలసీ బ్రీఫింగ్ లో హైదరాబాద్ లోని కొత్త కాన్సులేట్ గురించి ప్రస్తావించడం ప్రాధాన్యమైన విషయమన్నారు.
దక్షిణాసియాలోనే అతిపెద్ద కాన్సులేట్
హైదరాబాద్‌లో సౌత్ ఆసియాలోనే అతిపెద్ద విశాలమైన అమెరికన్ కాన్సులేట్ నిర్మించి భారతదేశంతోనే కాకుండా హైదరాబాద్‌తో కొనసాగుతున్న బలమైన బంధాన్ని అమెరికా మరోసారి గుర్తు చేసిందని వేదాంత్ పటేల్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన తెలుగు వారికి వీసా సౌకర్యాల కోసమే కాకుండా హైదరాబాద్‌లో అమెరికాకున్న వాణిజ్య అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విశాలమైన కాన్సులేట్ భవనాన్ని 12 ఎకరాల్లో అధునాతన పరిజ్ఞానంతో నిర్మించినట్లు తెలిపారు. కాగా అమెరికాతో వాణిజ్యానికి సంబంధించి హైదరాబాద్‌లోని కాన్సులేట్ కార్యాలయం ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తన లింక్డిన్ ప్రొఫైల్ ద్వారా మెసేజ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల వీసా కేంద్రంగా హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్ వీసాతో పాటు వాణిజ్య, పర్యాటక, డిపెండెంట్ వీసాల అవసరాలకు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కు రావడం తప్పనిసరి. దేశంలో వీసా, దౌత్య కార్యకలాపాల కోసం నాలుగు కాన్సులేట్‌లు ఉండగా, అందులో హైదరాబాద్‌లోని కాన్సులేట్ అతిపెద్దది కావడం గమనార్హం.
వీసా ఇంటర్వ్యూ అవసరం ఉన్నవారు మొదట హైటెక్ మెట్రో స్టేషన్‌లోని వీసా అప్లికేషన్ సెంటర్‌లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. వీసా రెన్యువల్ కోసం ఇంటర్వ్యూ మినహాయింపు కలిగిన వారు వీసా అప్లికేషన్ సెంటర్ లో డాక్యుమెంట్స్ దాఖలు చేస్తే చాలు. ఇంటర్వ్యూ అవసరం ఉన్నవారు నానక్‌రాం గూడలోని కొత్త అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment