అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
► రామంతాపూర్‌లో విషాదఛాయలు
హైదరాబాద్: ఇంటికి పెద్ద కొడుకు. ఐఐటీ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి... పై చదువుల కోసం అమెరికా పయనమయ్యాడు. లక్షల రూపాయల జీతం ఆఫర్లతో కంపెనీలు తన తలుపు తట్టినా... ఎంఎస్ కోసం వాటన్నింటినీ వదులుకున్నాడు. అమెరికాలో చదువు కోసం తాను పెట్టిన ఖర్చు గురించి బాధపడొద్దని... త్వరలోనే ఆ అప్పులన్నీ తీర్చేస్తానని అమ్మానాన్నలకు చెప్పి వెళ్లిన బిడ్డ ఆరు నెలలైనా తిరక్క ముందే బలవన్మరణానికి పాల్పడ్డాడు. కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. దీంతో రామంతాపూర్ ఇందిరానగర్‌లోని అతడి నివాసం వద్ద తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసి చుట్టుపక్కలవారు కన్నీటి పర్యంతమయ్యారు. అమెరికాలోని సౌత్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలో గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి
బంధువులు తెలిపిన వివరాలివి...
మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజీపేటకు చెందిన బండి గౌరీఉమాశంకర్, పద్మ దంపతులు హైదరాబాద్‌లోని రామంతాపూర్ ఇందిరానగర్‌లో నివసిస్తున్నారు. గౌరీశంకర్ బీహెచ్‌ఈఎల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్‌గా, ఆయన భార్య పద్మ మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. వీరి ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన శివకరణ్ (23) ఐఐటీ కోర్సు పూర్తి కాగానే గత ఏడాది ఆగస్టులో ఎంఎస్ కోసం అమెరికాలోని సౌత్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలో చేరాడు. మొదటి సెమిస్టర్‌లో ఆశించినన్ని మార్కులు, గ్రేడ్ రాలేదని మనస్థాపానికి గురై గురువారం వర్సిటీలోని హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం అతడి తల్లిదండ్రులకు సమాచారం అందింది.
అంత పిరికివాడు కాదు..
అయితే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని అతని మేనమామ శేఖర్ తెలిపారు. బుధవారం కూడా తనతో ఫోన్‌లో మాట్లాడాడని, తాను త్వరలోనే భారత్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నానని చెప్పాడన్నారు. అలాగే తాను అమెరికా వెళ్లేందుకు చేసిన అప్పుల గురించి బాధపడొద్దని, వాటన్నింటినీ తీరుస్తానని అమ్మానాన్నలకు చెప్పాలని కోరినట్టు శేఖర్ వెల్లడించారు.
అన్నింట్లో టాపరే..:
హబ్సిగూడ జాన్సన్ గ్రామర్ స్కూల్లో 10+2 చదివిన శివకరణ్... అన్ని తరగతుల్లో టాపర్‌గానే నిలిచాడు. మంచి ర్యాంక్‌తో మెదక్‌జిల్లా కంది ఐఐటీ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో సీటు వచ్చింది. అక్కడ చదువు పూర్తవగానే... మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా, వాటిని వదులుకుని ఉన్నత విద్య కోసం అమెరికా బాట పట్టాడు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడనుకున్న బిడ్డ జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడంతో బంధువులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.