మరికాసేపట్లో సీఎంకు 'హైపవర్' నివేదిక
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు కేకే నివాసంలో శుక్రవారం హైపవర్ కమిటీ భేటీ అయింది. కొత్తగా తెరపైకి వచ్చిన నాలుగు జిల్లాలు... గద్వాల్, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ డిమాండ్లపై ఈ కమిటీ ఇప్పటికే పరిశీలించింది. సదరు జిల్లాల ఏర్పాటుపై ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులతో కేకే అధ్యక్షతన హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించింది. జిల్లాల ఏర్పాటుపై ప్రజలు నుంచి వినతులు, అభ్యంతరాలను స్వీకరించింది.
అనంతరం ఈ అంశంపై కమిటీ తుది నివేదికను సిద్ధం చేస్తుంది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్కు ఈ కమిటీ తన నివేదిక ఇవ్వనుంది. తెలంగాణలో దసర రోజున కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే కొత్తగా మరో నాలుగు జిల్లాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటారు.
అలాగే సభ్యులుగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న ఉన్నారు. కొత్తగా తెరపైకి వచ్చిన నాలుగు జిల్లాలు... గద్వాల్, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ డిమాండ్లపై ఈ కమిటీ పరిశీలించి.. చర్చించి.. అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నాం కల్లా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.