'5న ఇక్కడే ఉంటాను.. ఎక్కడికీ పారిపోను'
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాద్‌లో ఉండొద్దంటూ తనను ఉద్దేశించి తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నాయకుడు నారాయణ స్పందించారు. తనను మంచి మిత్రుడని అంటూనే పరోక్షంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన కేసీఆర్‌కు హితవు పలికారు.
'హైదరాబాద్ ఎవరబ్బ సొత్తుకాదు. నేను 5వ తేదీన యిక్కడేవుంటాను. భయపడి పారిపోయేవాడిని కాను. నా ప్రకటన పాక్షికంగానే చెప్పారు. నేను 5వ తేదీన వివరంగా చెబుతాను. ప్రజలపేరుతో నాపై రెచ్చకొట్టాలనే కుటిల ప్రయత్నం మానుకోండి. హుందాగా ప్రవర్తించడం మంచిదని సలహా యిస్తున్నాను' అని నారాయణ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆదివారం పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా మేయర్ పీఠాన్ని గెలుపొందితే.. తాను చెవులు కోసుకుంటానని సీపీఐ నేత నారాయణ అన్నట్టు వచ్చిన వ్యాఖ్యలను కేసీఆర్ శనివారం హైదరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ 'నాకో మంచి దోస్తు ఉన్నడు. సీపీఐ నారాయణ. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్ ఒంటరిగా మేయర్ పీఠం గెలుచుకుంటే చెవులు కోసుంటా అన్నారు. నారాయణ గారూ.. మీరు ఐదో తేదీన హైదరాబాద్‌లో ఉండకండి. ఎవరన్నా చెవులు కోస్తే మళ్లీ మేమే ఈఎన్‌టీలో ఆపరేషన్ చేయించాలి. ఇదివరకే ఓసారి గాంధీ జయంతిన చికెన్ తిని, తప్పు ఒప్పుకుని ఏడాది పాటు చికెన్‌కు దూరం అయ్యిండు. చెవులు కోసుకోవడం ఏమిటి.. బేల మాటలు కాకుంటే..'అని వ్యాఖ్యానించారు.