రైతన్నా.. మీతో నేనున్నా..
- అన్నదాతలకు సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ
- అన్నివేళలా మీకు అండగా ఉంటాం
- ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి చెప్పండి.. పరిష్కరిస్తాం
- ఆత్మహత్యలకు పాల్పడవద్దని అభ్యర్థన
- పల్లెపల్లెనా ప్రచారానికి సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: ‘‘రైతన్నలారా.. ప్రకృతి సహకరించక, పంట చేతికి రాక మీరు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. మీకు అండగా మేమున్నాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రభుత్వానికి తెలియజేయండి. తక్షణమే పరిష్కార చర్యలు చేపడతాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు మనోధైర్యం కల్పిం చేందుకు వారికి అన్నివేళలా అండదండగా ఉంటామనే ధీమాను కల్పిస్తూ ఆయన ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.
‘‘ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబ సభ్యులు పడే ఆవేదనను అర్థం చేసుకోండి. మరణం సమస్యలను తీర్చకపోగా మీ కుటుంబానికి కొత్త సమస్యలను సృష్టిస్తుంది. నా విన్నపం ఒక్కటే. ఎన్నో త్యాగాలతో, ఎన్నో కష్టాలతో, ఎన్నో పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు ప్రపంచమంతా మనవైపు చూస్తోంది. పిరికితనంతో మనం ఆత్మహత్యలు చేసుకుందామా..? ధైర్యంగా ముందుగా సాగి ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణను సాధించుకుందామా? జీవన పోరాటంలో విజయం సాధించడానికి మీతో నేను చేయి కలుపుతాను. రైతన్నా.. మీతో నేనున్నా..’’ అని సీఎం కేసీఆర్ ఈ లేఖలో భరోసా ఇచ్చారు.
ఈ లేఖను కరపత్రాల రూపంలో పల్లెపల్లెనా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ శాఖ, గ్రామ పంచాయతీల ద్వారా ఇంటింటికీ ఈ లేఖను చేరవేయడం ద్వారా రైతులకు మనోధైర్యం కల్పించినట్లవుతుందని భావిస్తోంది. ఇందులో సీఎం సందేశంతో పాటు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు, వ్యవసాయ రంగం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావించారు. రూ.17 వేల కోట్ల పంట రుణాల మాఫీ, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్, జాప్యం లేకుండా విత్తనాలు, ఎరువుల సరఫరా, రబీ పంటలకు ప్రత్యేక ప్రణాళికలు, వెయ్యి మంది వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ ద్వారా మూడేళ్లలో సాగునీటి సరఫరా మెరుగుదల, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం రూ.ఆరు లక్షలకు పెంపు, బాధిత కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం వర్తింపు తదితర అంశాలు ఉన్నాయి.