సాక్షి, హైదరాబాద్: గ్రామాల వారీగా తనిఖీలు చేసి సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ, ఉద్యాన, పట్టు విభాగం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ రెవెన్యూ శాఖతో సంప్రదించి భూ ప్రక్షాళన వివరాల ఆధారంగా గ్రామాల వారీగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆ వివరాల ఆధారంగానే రాబోయే వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు.
జిల్లాల నుంచి వచ్చే ఈ సమాచారం ఆధారంగానే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా సాగుకు యోగ్యం కాని భూముల లెక్కలను సరిచూసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులు పరస్పర సంప్రదింపులతో ఖచ్చితమైన డేటాను అందుబాటులోకి తేవాలన్నారు.
గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణాధికారులు తమ పరిధిలో 2017–18 ఖరీఫ్, యాసంగి పంటల విస్తీర్ణాన్ని ఉద్యాన పంటలతో కలిపి క్రోడీకరించి వెంటనే పంపించాలని ఆయన ఆదేశించారు. ఆ వివరాలను కేబినెట్ సబ్‌కమిటీకి అందజేయాల్సి ఉందని చెప్పారు. రాబోయే బడ్జెట్‌లో ముఖ్యమంత్రి వ్యవసాయ యాంత్రీకరణపై ప్రత్యేక దృష్టి సారించనున్నందున రెవెన్యూ గ్రామం వారీగా వ్యవసాయ పరికరాల లభ్యత వివరాలను క్రోడీకరించి ఈనెల 12 కల్లా పంపించాలని ఆదేశించారు.
15 రోజుల కార్యక్రమం...
భూ ప్రక్షాళన రికార్డుల్లో పొందుపరిచిన వ్యవసాయ పట్టా భూముల వివరాలను రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్న తర్వాత గ్రామాల్లో సాగుకు యోగ్యంకాని భూముల గుర్తింపు కార్యక్రమం ప్రారంభం అవుతుందని పార్థసారధి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 15వ తేదీ నాటికి రెవెన్యూ శాఖ నుంచి సమాచారం వచ్చే అవకాశముందన్నారు. అక్కడి నుంచి సమాచారం రాగానే గ్రామాల్లో తనిఖీలు చేపడతామన్నారు. సాగుకు యోగ్యంకాని భూముల గుర్తింపు ప్రక్రియ దాదాపు 15 రోజులపాటు జరిగే అవకాశముందన్నారు.
మూల విత్తనంపై దృష్టిపెట్టాలి
సోయాబీన్, శనగ, వేరుశనగలో నాణ్యమైన విత్తనోత్పత్తికి సరిపడా మూలవిత్తనాన్ని సరఫరా చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ, విత్తన ధృవీకరణ సంస్థ, విత్తనాభివృద్ధి సంస్థల అధికారులతోపాటు రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ, జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ దేశీయ విత్తన భాండాగారం నుంచి ప్రపంచ భాండాగారం దిశగా, విత్తనోత్పత్తిలో నూతన విధానాలను అవలంభిస్తూ అడుగులు వేస్తున్నామన్నారు. విత్తనోత్పత్తిలో ఉన్న లోటుపాట్లను చక్కదిద్ది నాణ్యమైన విత్తనోత్పత్తి జరగాలన్నారు. అందుకే మూల విత్తనంపై దృష్టిపెట్టాలన్నారు. ఆదిలాబాద్, ముథోల్, రుద్రూరు వ్యవసాయ పరిశోధన స్థానాల్లో వెయ్యి క్వింటాళ్ల సోయాబీన్ మూల విత్తనోత్పత్తి చేపట్టాలన్నారు. గతంలోలా కాకుండా 500 క్వింటాళ్ల శనగ మూల విత్తనోత్పత్తిని రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ చేపట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment