30లోపు దరఖాస్తు చేయకుంటే ఫీజు ‘సున్నా’
♦ వృత్తి విద్యా కాలేజీలకు ఏఎఫ్‌ఆర్‌సీ స్పష్టీకరణ
♦ సొంత పరీక్షల నిర్వహణకు మార్గదర్శకాలు
♦ ఆదేశాలు పాటించకపోతే పరీక్షల రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వృత్తి విద్యా కాలేజీలు వచ్చే మూడేళ్లపాటు వసూలు చేయాల్సిన ఫీజులను నిర్ణయించేందుకు తమ ఆదాయ వ్యయాలు, ఫీజుల ప్రతిపాదనలతో జనవరి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. గడువును పెంచేది లేదు’’ అని తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) స్పష్టం చేసింది. ‘‘గడువులోగా దరఖాస్తు చేయని కాలేజీలకు ఫీజు నిర్ణయించబోం. వాటికి ‘సున్నా’ ఫీజును కేటాయించాల్సి వస్తుంది’’ అని కూడా పేర్కొంది. బుధవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ స్వరూప్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశమైంది.
వృత్తి విద్యా కాలేజీల్లో ప్రవేశాలు, ఫీజులకు సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. చాలా కాలేజీలు ఫీజుల ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు వెబ్‌సైట్ నుంచి ఫారాలు డౌన్‌లోడ్ చేసుకున్నా, ఇప్పటిదాకా 20 కాలేజీలు మాత్రమే ఆదాయ వ్యయాలను అప్‌లోడ్ చేయడంపై చర్చించారు. ఇప్పటికే రెండుసార్లు దరఖాస్తుల గడువు పొడగించినందున ఇకపై పొడగించరాదని నిర్ణయించారు.
పలు కోర్సుల్లో ప్రవేశాలను ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల ద్వారా కాకుండా సింగిల్ విండో-3 పేరుతో యాజమాన్యాలే అసోసియేషన్ ఆఫ్ కన్సార్షియం (ఏసీ)గా ఏర్పడి సొంతగా నిర్వహించుకొని (సెట్-ఏసీ) ప్రవేశాలు చేపట్టేలా ప్రస్తుతమున్న నిబంధనలకు మరికొన్నింటిని జోడించారు. ఉన్నత విద్యా శాఖ నిర్వహించే ప్రవేశ పరీక్ష ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు జరిపే మైనారిటీ కాలేజీలు అసోసియేషన్ ఆఫ్ కన్సార్షియంగా ఏర్పడి , సొంతంగా కన్వీనర్‌ను నియమించుకొని చేపట్టే ప్రవేశాల (సింగిల్ విండో-2) నిబంధనలను కూడా మరింత పారదర్శకంగా మార్చేలా పలు నిర్ణయాలు తీసుకుంది. సంబంధిత దరఖాస్తుల స్వీకరణకు, స్క్రుటినీకి విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు కమిటీ వేసింది. ఈసారి మెడికల్ ప్రవేశాలను తెలంగాణ ఆరోగ్య వర్సిటీ నేతృత్వంలోనే చేపట్టేలా చూడాలని అభిప్రాయపడింది.
ప్రధాన నిర్ణయాలివీ...
సింగిల్ విండో-2, సింగిల్ విండో-3 ప్రవేశాల నోటిఫికేషన్ల ప్రకటనను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఒక్కో ప్రధాన పత్రికలో ఇవ్వాలని గతంలో ఉండగా, పారదర్శకతను పెంచేందుకు పత్రికల సంఖ్య పెంచాలి
యాజమాన్యాలు నిర్వహించేఉమ్మడి ప్రవేశ పరీక్ష హాల్లోకి ఇన్విజిలేటర్లు కూడా సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడానికి వీల్లేదు. పరీక్ష హాల్లో సీసీ టీవీ, పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేయాలి. సీసీ ఫుటేజీని ఏఎఫ్‌ఆర్‌సీ చెప్పినన్ని రోజులు భద్రపరుచాలి. ప్రవేశ పరీక్షకు సంబంధిం చి 2 సెట్లకు బదులు మూడు సెట్ల ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచాలి. ప్రవేశ పరీక్ష ఫలితాలను అందుబాటులో ఉంచేం దుకు ఎంసెట్-ఏసీ వంటి వెబ్‌సైట్లను ఏర్పా టు చేయాలి. పరీక్షలను పక్కాగా నిర్వహిం చి పకడ్బందీగా ప్రవేశాలు చేపడతామంటూ కన్సార్షియం నియమించే కన్వీనర్ ఏఎఫ్‌ఆర్‌సీకి అఫిడవిట్ సమర్పించాలి. కన్సార్షియం పరీక్ష నిర్వహణకు పేరు, విశ్వసనీయత, ప్రత్యేకత ఉన్న ఏజెన్సీనే ఎంపిక చేయాలి. వాటి అనుభవాన్ని ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయిస్తుం ది. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ప్రవేశ కౌన్సెలింగ్‌ను పర్యవేక్షిం చేందుకు, విజిలెన్స్ స్క్వాడ్లను పంపే అధికారం ఏఎఫ్‌ఆర్‌సీకి ఉంటుంది. ప్రభుత్వ, ఏఎఫ్‌ఆర్‌సీ ఆదేశాలు పాటించకపోతే పరీక్షను, కౌన్సెలింగ్‌ను, ప్రవేశాలను రద్దు చేసే అధికారం ఏఎఫ్‌ఆర్‌సీదే. నిర్వహణ సంస్థను మార్చేం దుకు, మళ్లీ పరీక్ష నిర్వహించేలా ఆదేశించేందుకూ ఏఎఫ్‌ఆర్‌సీకి అధికారముంటుంది. కాలేజీల్లో చేరిన అభ్యర్థుల జాబితాలను ప్రవేశాలు చేపట్టిన నాలుగు రోజుల్లో అందజేయకపోతే తుది దశ కౌన్సెలింగ్, ప్రవేశాలను రద్దు చేసే ఆస్కారముంటుంది.