కాళేశ్వరం ఎత్తిపోతలపై దుష్ర్పచారం
సాక్షి, హైదరాబాద్: ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, టీడీపీ నాయకులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. నాడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పెదవి విప్పని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, టీడీపీ నాయకుడు నర్సిరెడ్డి ఇపుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో బుధవారం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రాజెక్టులు కట్టవద్దనేదే వీరి లక్ష్యమని విమర్శించారు.
తుమ్మిడిహెట్టి, కాళేశ్వరం వల్ల ఆదిలాబాద్‌కు నష్టమని దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తవ్విన కాల్వలను ఉపయోగించుకుంటాం, ముంపు లేకుండా బ్యారేజీ నిర్మించి నీళ్లిస్తాం. బ్యారేజీ మారినా పాత పద్ధతిని కొనసాగిస్తాం ’ అని మంత్రి అన్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాకే అదనంగా లక్ష ఎకరాలకు నీరిస్తామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత సరిగా లేనందునే కాళేశ్వరాన్ని ఎంపిక చేశామన్నారు.
ప్రాజెక్టు ఖర్చు విషయంలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే, ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.1,900 కోట్లు ఖర్చు అవుతుందని, అదే కాళేశ్వరం దిగువన 20 కిలోమీటర్ల వద్ద మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీకు రూ.1800 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని హరీశ్ పేర్కొన్నారు. విపక్షాలు అబద్దాలు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని, తెలంగాణ ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రాణహిత -చేవెళ్లపై అప్పటి మహారాష్ట్ర సీఎం అభ్యంతరం చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. చివరకు లగడపాటి రాజగోపాల్ వంటి తెలంగాణ బద్ధ వ్యతిరేకులకూ ఆశ్రయమిచ్చిన షబ్బీర్ అలీ వంటి నాయకులూ విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, బి.గణేష్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మొక్కలను చంటి పిల్లల్లా పెంచండి
తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను చంటి పిల్లల్లా సంరక్షించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 150 వ్యవ సాయ మార్కెట్ యార్డుల్లో హరితహారం కార్యక్రమం అమలు తీరుపై బుధవారం వాట్సప్ ద్వారా సమీక్షించారు. ఒక్కో మార్కెట్ యార్డు పరిధిలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు.
మార్కెట్ యార్డుల వారీగా ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారనే అంశంపై మంత్రి వివరాలు సేకరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. జోన్లవారీగా అధికారులు బృందాలుగా ఏర్పడి ఇప్పటి వరకు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత చేపట్టాలన్నారు. మార్కెట్ యార్డులలో హరితహారం కార్యక్రమం అమలవుతున్న తీరుపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.