పండుగ వేళ బంగారం వ్యాపారుల మోసాలు..
హైదరాబాద్: దీపావళీ పండుగ సందర్భంగా బంగారు వర్తకులు కొనుగోలుదారులను మోసం చేస్తున్నట్టు తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. బంగారం స్వచ్ఛత, తూకంలో దగా, నాణ్యత లేమి, తరుగు పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో ప్రముఖ ఆభరణాలు, షాపింగ్ మాల్స్‌లలో తనిఖీలు నిర్వహించిన అధికారులు 82కు పైగా కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర కంట్రోలర్, అదనపు డీజీపీ గోపాల్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో 15, రంగారెడ్డిజిల్లాలో 9, నల్లగొండలో 4, వరంగల్‌లో 9, కరీంనగర్‌లో 14, నిజామాబాద్‌లో 2, మహబూబ్‌నగర్‌లో 7, మెదక్‌లో 10, ఖమ్మం జిల్లాలో 12 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని వినియోగించి తయారు చేసిన ఆభరణాలను విక్రయిస్తునట్లు గుర్తించామన్నారు.