♦ వ్యవసాయానికి తగిన సౌకర్యాలు కల్పించామన్న కారణం సరికాదు
♦ కరువు మండలాలపై జీవన్‌రెడ్డి పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు
♦ కలెక్టర్ సిఫారసులను, జీవన్‌రెడ్డి వినతులను పరిగణనలోకి తీసుకోండి
♦ ప్రభుత్వ పాలసీ, మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకోండి
♦ 21 కరువు మండలాలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం కోసం తగిన సౌకర్యాలు కల్పించామన్న కారణంతో కరువు పరిస్థితులు ఉన్న ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించరా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆ కారణంతో కరువు మండలాలను ప్రకటించకపోవడం ఎంత మాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. కరీంనగర్ జిల్లాలో కరువు మండలాల ప్రకటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ సిఫారసులను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. కరువు మండలాలుగా ప్రకటించకుండా వదిలేసిన 21 మండలాల విషయంలో కలెక్టర్ సిఫారసులను, జీవన్‌రెడ్డి వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పాలసీ, మార్గదర్శకాల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇందుకు ప్రభుత్వానికి మూడు వారాల గడువునిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాలో కరువు మండలాల ప్రకటనకు సంబంధించి ప్రభుత్వం వివక్ష చూపుతోందని, జిల్లా మొత్తం 40 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ సిఫారసు చేస్తే, అందుకు విరుద్ధంగా ప్రభుత్వం 19 మండలాలనే ప్రకటించిందని, దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ కరువు మండలాల ప్రకటనకు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా కలెక్టర్ జిల్లాలో మొత్తం 40 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలంటూ గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వానికి సిఫారసు చేశారని, అయితే ప్రభుత్వం 19 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల నియోజకవర్గంలో అన్ని మండలాలను అధికారులు పక్కనపెట్టేశారని తెలిపారు.
తెలంగాణ అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ 21 మండలాల్లో వ్యవసాయ సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయని, అందువల్ల నిబంధనల మేర తగిన నిర్ణయమే తీసుకున్నామన్నారు. దీనికి సత్యంరెడ్డి స్పందిస్తూ కాలువలు ఉన్నాయని, అయితే గత రెండేళ్లుగా వాటిలో చుక్క నీరు కూడా లేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ నీళ్లు లేని కాలువలు ఉండి ప్రయోజనం ఏముందని ఏజీని ప్రశ్నించింది. వ్యవసాయ సదుపాయాలు, సౌకర్యాలు కల్పించామన్న కారణంతో కరువు పరిస్థితులు ఉన్న ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం సరికాదని పేర్కొంది. కరువు మండలాలుగా ప్రకటిస్తే కేంద్రం నుంచి రైతులకు కొన్ని ప్రయోజనాలు దక్కుతాయని, జిల్లా పరిషత్ కూడా 21 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఏకగ్రీవ తీర్మానం చేసిందని సత్యంరెడ్డి కోర్టుకు నివేదించారు. పిటిషనర్ జీవన్‌రెడ్డి ఎమ్మెల్యే అన్న విషయం తెలుసుకున్న ధర్మాసనం, ఎమ్మెల్యే అయి ఉండి ఎందుకు కోర్టుకొచ్చారని, ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించవచ్చుకదా అని సత్యంరెడ్డిని ప్రశ్నించింది. ప్రస్తుతం అసెంబ్లీ సెషన్ లేదని, బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా దీని గురించి ప్రస్తావిస్తారని సత్యంరెడ్డి తెలిపారు.
కరువు మండలాలను ప్రకటించరా?
Published Tue, Feb 2 2016 3:38 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement