రాష్ట్రం ఓ అప్పుల అప్పారావ్
ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం ఉల్లంఘన
గాడి తప్పి 3.74 శాతం చేరిన ద్రవ్యలోటు
పేరుకు రూ. 1.17 లక్షల కోట్లు వ్యయం
ఇందులో బుక్ సర్దుబాటు ఆరు వేల కోట్లు
జీవోలు ఇచ్చారే తప్ప నిధులు విడుదల చేయలేదు
సంక్షేమం, విద్య, పశుసంవర్థక, మత్య్సశాఖ ఖర్చులో వెనుకబాటు
సాక్షి, హైదరాబాద్: హంగులు, ఆర్భాటాలతో యథేచ్ఛగా దుబారా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తోంది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్యలోటు మూడు శాతానికి మించకూడదు. అయితే మార్చితో ముగిసిన 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు మించి అప్పులు చేసింది. దీంతో ద్రవ్యలోటు 3.74 శాతానికి చేరింది. నిబంధనలకు మించి చేసిన అప్పులకు కేంద్రం నుంచి ఆమోదం పొందాల్సి ఉంది. అంతే కాకుండా గత ఆర్థిక సంవత్సరంలో నిబంధనలకు మించి అప్పు చేసినందున ఆ మేరకు ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరం అప్పుల్లో కేంద్రం కోత విధించనుంది.
మరోవైపు గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అమలు ఘనంగా ఉందని ప్రభుత్వం చెబుతుండగా వాస్తవ పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నా యి. ప్రణాళికేతర వ్యయాన్ని ప్రణాళికా కేటాయింపులకు మార్చడం, చేయని వ్యయం చేసినట్లు బుక్ సర్దుబాట్లు చేయడం వంటి మాయాజాలానికి ప్రభుత్వం పాల్పడింది. బడ్జెట్ కేటాయింపులకు మించి వ్యయం చేశామని చెబుతున్నప్పటికీ... మార్చి నెలలో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చారే తప్ప నిధులు విడుదల చేయలేదు. అలా చూపిన వ్యయం రూ.6వేల కోట్లు కేవలం పుస్తకాల్లో సర్దుబాటు లెక్కలకే పరిమితమైంది.
పుస్తకాల సర్దుబాటే!
2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.1,13,048 కోట్ల వ్యయం చేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. అయితే రూ.1,17,439 కోట్ల వ్యయం చేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంటోంది. ఇందులోను బడ్జెట్‌లో పేర్కొన్న దానికన్నా ప్రణాళికా వ్యయం ఎక్కువగా చేశామని, ఇది రికార్డు అని సర్కారు పేర్కొంటోంది. అయితే బడ్జెట్ కన్నా ఎక్కువ వ్యయం చేశామనడం కేవలం పుస్తకాల సర్దుబాటుకే పరిమితమైంది. మార్చి చివర్లో కేంద్రం రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధులకు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇచ్చిన నిధులకు ప్రభుత్వం జీవోలు జారీ చేసిందే తప్ప నిధులు మాత్రం ఇవ్వలేదు. అలాగే ఉద్యానవన రైతుల రుణ మాఫీ పేరుతో కూడా జీవో జారీ చేశారే తప్ప నిధులు విడుదల చేయలేదు. ఈ విధంగా రూ.ఆరు వేల కోట్లు వ్యయం చేసినట్లు పుస్తకాల్లో చూపించారే తప్ప వాస్తవంగా నిధులివ్వలేదు. ఇవన్నీ కలిపే రూ.1,17,439 కోట్లు వ్యయం చేసినట్లు ఆర్థిక శాఖ లెక్కచెపుతోంది.
విద్య, సంక్షేమ రంగాల వ్యయంలో వెనుకబాటు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట వేశామని చెబుతుండగా వాస్తవంగా గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను పూర్తిగా వ్యయం చేయలేదని తేలింది. ఈ రంగాలకు గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఏకంగా 20 శాతం నిధులను వ్యయం చేయకుండా మురగపెట్టినట్లు స్పష్టమైంది. విద్య, పశుసంవర్థక, మత్య్స రంగాలకు కేటాయించిన నిధుల్లో 20 శాతం నిధులను వినియోగించలేదు.
ప్రణాళికేతర వ్యయంలో మాయలెక్కలు
మరోవైపు ప్రణాళికేతర వ్యయం బడ్జెట్‌లో రూ.78,636 కోట్లుగా పేర్కొనగా కేవలం రూ.70,986 కోట్లకే పరిమితం చేసినట్లు ఆర్థిక శాఖ మాయ లెక్కలు చెబుతోంది. ప్రణాళికేతర వ్యయం కింద చేయాల్సిన ఖర్చులను ప్రణాళిక కిందకు తీసుకువచ్చి... ప్రణాళికా వ్యయం ఎక్కువగా చేశామని, ప్రణాళికేతర వ్యయం తగ్గించామని గొప్పులు చెప్పుకుంటోంది. ముగి సిన ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక లెక్కల మేరకు రెవెన్యూ లోటు రూ.7,143 కోట్లుగా తేల్చారు.
ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్రం, రాష్ట్రం ద్వారా మొత్తం రూ.90.124 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా వాస్తవంగా రూ.88,522 కోట్లు ఆదాయం వచ్చింది. రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రూ.44,423 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా రూ.40,311 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే రాష్ట్ర పన్నేతర ఆదాయం రూ.5341 కోట్లు వస్తుందని అంచనా వేయగా రూ.4350 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రణాళికా సాయం కింద రూ.10 వేల కోట్లు వస్తాయని అంచనా వేయగా అంచనాలకు మించి రూ.14,600 కోట్ల రూపాయలు వచ్చాయి.