సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రెవెన్యూ లోటు, అప్పులపై ప్రతిపక్ష నేతలు, వారి అనుబంధ మీడియా వాస్తవాలను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. రెవెన్యూ లోటు, అప్పులనేవి ఏ ప్రభుత్వంలోనైనా ఉంటాయని చెప్పారు. టీడీపీ, దాని అనుబంధ మీడియాకు చంద్రబాబు హయాంలో రెవెన్యూ లోటు, అప్పులు కనిపించలేదని, ఇప్పటి ప్రభుత్వంలోనే ఏదో జరిగిపోయినట్లు అవాస్తవాలతో ప్రజల్లో అపోహలు, భయాలు సృష్టించేందుకు కథనాలు రాయడం శోచనీయమని అన్నారు. తప్పుడు ప్రచారంతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీయడమే వారి కుట్రగా ఉందన్నారు.
మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిందంటూ తప్పుడు కథనాలు రాస్తున్నారు. అప్పులు ఆగిపోయి ప్రభుత్వ కార్యక్రమాలు నిలిచిపోవాలనేది వారి ఆశ. రెవెన్యూ లోటు ఈ ఆర్థిక ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 918.14 శాతానికి చేరిందని రాశారు. చంద్రబాబు హయాంలో 2017–18లో రెవెన్యూ లోటు ఏకంగా 5,484 శాతం పెరిగింది. అప్పులు కూడా చంద్రబాబు హయాంలో పరిమితికి మించి రూ 16,418 కోట్లు చేశారు. ఆ మొత్తాన్ని కేంద్రం ఇప్పుడు కోత విధిస్తామని చెప్పింది.
ఈ విషయాలన్నీ ఆ పత్రికకు ఎందుకు కనిపించడంలేదు?’ అని ఆయన నిలదీశారు. అప్పులు చంద్రబాబు ప్రభుత్వంలో 17.33 శాతం పెరగ్గా ఇప్పటి ప్రభుత్వంలో 14.88 శాతమే పెరిగాయని వివరించారు. కేంద్రం అనుమతించిన పరిమితిలోనే ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోందన్నారు. ‘కోవిడ్ లేనప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు మించి భారీగా అప్పులు చేశారు. భారీగా బకాయిలు కూడా పెట్టారు. ఇప్పుడు కోవిడ్ సంక్షోభం వల్ల రాబడి పడిపోయి, ప్రపంచమంతా అప్పులు చేస్తున్నారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం కూడా పడిపోయింది. అయినా వైఎస్ జగన్ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి, నిబంధనలకు లోబడే అప్పులు చేస్తూ ఆ నిధులను సామాజిక, ఆర్థిక ప్రగతికి వెచ్చిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం భారీగా మిగిల్చిన బకాయిలను కూడా చెల్లిస్తోంది.
కేంద్రం నుంచి వచ్చే రాబడి, రాష్ట్ర రాబడి తగ్గినా సీఎం జగన్ నగదు బదిలీ ద్వారా రూ. 1.27 లక్షల కోట్లను పేద ప్రజల చేతిలో పెట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టారు. కోవిడ్ సంక్షోభంలో బడ్జెట్ అంచనాలను వేయడం కష్టం. ఏ సంక్షోభం లేని సమయంలో చంద్రబాబు హయాంలో బడ్జెట్ అంచనాలకు మించి రెవెన్యూ లోటుతో పాటు ద్రవ్య లోటు చేరాయి. పరిమితులకు మించి భారీగా అప్పులు చేశారు’ అని ఆయన వివరించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ఒకరోజు ముందు చంద్రబాబు ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు అప్పు చేసింది. గతంలోఎప్పుడూ ఒక్కరోజు ఇంత అప్పు చేసిన సందర్భాలు లేవు. పసుపు కుంకుమ పేరుతో ప్రజల్ని మభ్య పెట్టడానికి ఈ అప్పు చేశారు.
ఆ మూడు రంగాలకు సీఎం అధిక ప్రాధాన్యత
‘ప్రతిపక్షాలు అసత్య ప్రచారం వల్ల ఏపీఎస్‌డీసీపై గత జూలైలో కేంద్రం లేఖ రాసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి కేంద్రం సంతృప్తి చెందింది. రాజ్యాంగబద్ధంగా బడ్జెట్ ప్రోసెస్ అయ్యాకే ఏపీఎస్‌డీసీకి నిధులు వెళ్తాయి. ఎన్‌హెచ్‌ఏఐ కూడా ఇదే తరహాలో అప్పులు సమీకరిస్తుంది. ఏపీఎస్‌డీసీ రాజ్యాంగబద్ధంగానే ఏర్పాటైనట్లు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఆ సంస్థ నుంచి రుణాలు తీసుకోవడం, చెల్లించడం జరుగుతోంది. కేంద్రం నుంచి ఆ తర్వాత ఎటువంటి లేఖ రాలేదు. బ్యాంకులను హెచ్చరించలేదు. పైగా, ఏపీఎస్‌డీసీకి ఏఏ రేటింగ్ కూడా వచ్చింది. అయినా, ఇప్పుడు విపక్ష మీడియా వక్రీకరణలు, అవాస్తవాలతో వార్త రాయడం వెనుక ఉద్దేశమేమిటో అందరికీ తెలుసు’ అని చెప్పారు.
ఆస్తుల తనఖా కొత్తదేమీ కాదని తెలిపారు. ప్రభుత్వ గ్యారెంటీతో గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆస్తులు తనఖా పెట్టిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆస్తులనే వేలం వేసి వనరులు సమీకరిస్తోందని చెప్పారు. ఇక్కడ తనఖా మాత్రమే పెడుతున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం రుణాల కోసం సీఆర్‌డీఏ భూములను హడ్కోకు తనఖా పెట్టిందన్నారు. విద్యుత్ మిగులున్నా చంద్రబాబు ప్రభుత్వం అధిక ధరకు దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాలు చేసుకుందని, విద్యుత్ రంగానికి భారీగా అప్పులు, బకాయిలు పెట్టిందని ఆయన వివరించారు. మహిళా సాధికారికతకు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యతతో ఖర్చు చేస్తున్నారని, తద్వారా సామాజిక ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడమే మీ లక్ష్యమా..?
Published Wed, Feb 16 2022 3:20 AM | Last Updated on Wed, Feb 16 2022 11:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment