సత్వర సేవలు | instant service for peoples | Sakshi
Sakshi News home page

సత్వర సేవలు

Published Tue, Oct 8 2013 3:02 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM

instant service for peoples

సాక్షి, సిటీబ్యూరో : ప్రజలకు సత్వరం సేవలందించేందుకు తార్నాకలోని ప్రధాన కార్యాలయంలో కొత్తగా పౌరసేవల కేంద్రాన్ని (సిటిజన్ ఫెసిలిటేషన్ సెంటర్) ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌ఎండీఏ సెక్రటరీ బి.రామారావు ప్రకటించారు. మరో రెండు నెలల్లో ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తార్నాక హెచ్‌ఎండీఏ కార్యాలయంలో సోమవారం ప్లానింగ్ డెరైక్టర్లు వెంకటరత్నం, జియాఉద్దీన్, ఎస్‌యూపీసీ భిడేలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు సేవలందించడంలో జాప్యం, అవినీతి, అక్రమాలతో అపకీర్తిని మూటగట్టుకొన్న ప్లానింగ్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించామన్నారు.
 
 ఇందులో భాగంగా సంస్కరణలు అమలు
 చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్లానింగ్ డెరైక్టర్ వెంకటరత్నం మాట్లాడుతూ.. ప్రజలకు సత్వరం సేవలందించేందుకు ప్లానింగ్ విభాగం విధుల పునర్నిర్మాణం, కంప్యూటరైజేషన్‌పై ఇటీవల ‘ఆస్కీ’ చేత అధ్యయనం చేయించినట్లు తెలిపారు. వారి సూచనల మేరకు పౌరసేవల కేంద్రం ఏర్పాటుతోపాటు అనుమతుల్లో జాప్యానికి తావు లేకుండా  జేపీవో,ఏపీవో, పీవో, సీపీవోలను ఒక యూనిట్‌గా చేర్చి ఒకేచోట విధులు నిర్వహించేలా నిర్ణయం తీసుకొన్నామన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, పరిష్కరించేందుకు పౌరసేవల కేంద్రం కృషి చేస్తుందన్నారు.
 
 ఈ కేంద్రంలో ముగ్గురు సిబ్బంది సేవలందిస్తారని, వీరు పరిశీలించి స్వీకరించిన దరఖాస్తులో ఏదైనా పత్రం (జిరాక్స్ కాపీ) మిస్ అయితే... దానికి హెచ్‌ఎండీఏనే బాధ్యత వహిస్తుందన్నారు. మొదట జెపీఓ/ఏపీఓలు దరఖాస్తులను ప్రాసెసింగ్ చేసి వారంలోగా పైఅధికారులకు పంపాల్సి ఉంటుందని, ఒకవేళ ఆయా ఫైళ్లు ఎక్కడైనా ఆగితే... ఎందుకు ఆగిందనేని తెలుసుకొని వారిపై చర్యలు తీసుకొనే అధికారం సీపీఓ స్థాయి అధికారికి  అప్పగించినట్లు వివరించారు. ప్లానింగ్ విభాగాన్ని మొత్తం 5 యూనిట్స్‌గా విభజించి సేవలందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.మ్యాన్యువల్ సేవల ఫలితంగా కలుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఆన్‌లైన్ సేవలందించనున్నట్లు తెలిపారు. మరో ఏడాదిలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు.
 
 జెడ్‌ఓలకు టాటా..!
 జోనల్ అధికారులను తప్పించి వారి సేవలను హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలోని కీలక విభాగాల్లో వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు సెక్రటరీ రామారావు వెల్లడించారు. జోనల్ కార్యాలయాల నిర్వహణ సరిగ్గా లేనందునే సంస్థకు అపకీర్తి వచ్చిందన్నారు. శంకర్‌పల్లి జోనల్ కార్యాలయంలో ఫైళ్లు కాలిపోవడం, ఘట్‌కేసర్, మేడ్చల్, శంషాబాద్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు వెలుగు చూడటంతో జోనల్ అధికారులుగా ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను అక్కడి నుంచి తప్పిస్తున్నట్లు వివరించారు. ప్రధానంగా భూములకు సంబంధించిన విషయాలను సులభంగా పరిష్కరిస్తారన్న ఉద్దేశంతో రెవెన్యూ విభాగం నుంచి వీరిని డిప్యూటేషన్‌పై తీసుకొన్నామని, అయితే ఆ ఉద్దేశం నెరవేరలేదన్నారు. దాంతో నలుగురు జోనల్ అధికారుల సేవలను ఓఆర్‌ఆర్, ల్యాండ్ పూలింగ్, గ్రిడ్‌రోడ్స్, రేడియల్ రోడ్స్ విభాగాల్లో వినియోగించుకొంటామని సెక్రటరీ స్పష్టం చేశారు.
 
 ముఖ్యంగా జోనల్ అధికారులతో కోఆర్డినేషన్‌కు ప్రత్యేకంగా యూనిట్-6ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే... జోనల్ ఆఫీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని, అక్కడ ఏపీఓ, జేపీఓల ద్వారా దరఖాస్తులు స్వీకరించడంతోపాటు ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్లు కూడా నిర్వహిస్తామన్నారు. వారానికోసారి ఉన్నతాధికారులు అక్కడికెళ్లి ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారని తెలిపారు. భవన నిర్మాణంలో అతిక్రమణలుంటే ఏపీఓ, జేపీఓలు క్షేత్రస్థాయి పర్యటనలో గమనించి గ్రామపంచాయతీ నుంచి నోటీసు ఇప్పించడం ద్వారా చట్టపరంగా చర్యలు తీసుకొంటామన్నారు. ప్రస్తుతం జోనల్ కార్యాలయాల్లో ఉన్న రికార్డులన్నీ తార్నాక ప్రధాన కార్యాలయానికి తెప్పిస్తామన్నారు. ఇక్కడే ల్యాండ్ వెరిఫికేషన్ యూనిట్‌ను ఒకదాన్ని నెలకొల్పాలన్న ఆలోచన కూడా ఉందని సెక్రటరీ వివరించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement