
ఎంత కష్టం
సాయంత్రం 5.30 గంటలు...ఎస్.ఆర్.నగర్ నుంచి నాంపల్లి వెళ్లేందుకు వినయ్ ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
ఇళ్లలోకి వరద నీరు
కాలువలను తలపించిన రహదారులు
గంటల తరబడి ట్రాఫిక్ జాం
వాహన చోదకులు, ప్రయాణికుల అవస్థలు
సిటీబ్యూరో: సాయంత్రం 5.30 గంటలు...ఎస్.ఆర్.నగర్ నుంచి నాంపల్లి వెళ్లేందుకు వినయ్ ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. భారీ వర్షంతో పంజగుట్ట-ఖైరతాబాద్ మార్గంలో వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ట్రాఫిక్ రద్దీలో నాంపల్లి చేరుకునేందుకు ఆయనకు గంటన్నర సమయం పట్టింది.
సమయం సాయంత్రం 6 గంటలు... అమీర్‌పేట్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు స్నేహ బస్సులో బయలుదేరింది. రాత్రి 9.30 గంటలకు గానీ గమ్యస్థానానికి చేరుకోలేకపోయింది.పవన్ హైటెక్ సిటీ నుంచి సాయంత్రం 6 గంటలకు కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు బయలుదేరాడు. రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది.
సుభాష్ రాత్రి 8 గంటలకు బంజారాహిల్స్ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఉప్పల్‌లోని తన నివాసానికి చేరేటప్పటికి రాత్రి 11 గంటలైంది... గేటర్‌లో శుక్రవారం కురిసిన భారీ వ ర్షానికి లక్షలాది మంది వాహన చోదకులు, ప్రయాణికుల నరక యాతనకు ఇవి కొన్ని ఉదాహరణలు. ప్రధాన మా ర్గాల్లో మెట్రో పనులతో బారికేడ్లఏర్పాటుతో కుంచించుకుపోయిన రహదారులపై మోకాలి లోతు న వరదనీరు నిలిచిపోయింది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.
తడిసి ముద్దయిన నగరం
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ నగరం తడిసి ముద్దవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. సనత్‌నగర్‌లోని శివాజీ నగర్‌తో పాటు మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. నీటిని తొలగించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. రహదారులు కాల్వలను తలపించాయి. వివిధ బస్‌స్టాప్‌ల వద్ద పెద్ద ఎత్తున వరదనీరు ప్రవహించడంతో ప్రయాణికులు తల దాచుకునేందుకు కూడా వీలులేకపోయింది. అబిడ్స్, కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బేగంపేట్, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్, మెహిదీపట్నం ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై మోకాలి లోతున వర్షపునీరు నిలిచిపోయింది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది. వర్షపు నీటిలోనే ఈదుకుంటూ వాహనాలు ముందుకు కదిలాయి. గంటల తరబడి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని వాహనదారులు, ప్రయాణికులు విలవిల్లాడారు.
నాలాల్లో వరద ఉద్ధృతి పెరిగింది. సహాయక చర్యలకు ప్రత్యేక సిబ్బందిని జీహెచ్‌ఎంసీ రంగంలోకి దించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. రాత్రి 8.30 గంటల వరకు 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. హకీంపేట్‌లో 3.1 సెంటీమీటర్లు, మహేశ్వరంలో 1.7, హయత్‌నగర్‌లో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.