‘గ్రేటర్’ మేయర్ బొంతు రామ్మోహన్ ? | Is bonthu ram mohan to be elected as Greater mayor ? | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్’ మేయర్ బొంతు రామ్మోహన్ ?

Published Thu, Feb 11 2016 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

‘గ్రేటర్’ మేయర్ బొంతు రామ్మోహన్ ?

‘గ్రేటర్’ మేయర్ బొంతు రామ్మోహన్ ?

- డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్!
- టీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో నేడు మంత్రి కేటీఆర్ ప్రత్యేక భేటీ
- ఉదయం 11 గం.కు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక
- ఎక్స్‌అఫీషియో సహా మొత్తం ఓట్లు 217...
- ఇందులో టీఆర్‌ఎస్‌కు ఉన్నవి 134

 
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)పై గులాబీ జెండా గురువారం అధికారికంగా ఎగరనుంది. జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్‌ఎస్ ఏకంగా 99 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో... మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ ఆ పార్టీ చేతుల్లోనే ఉండనున్నాయి. ఈ పదవులు ఎవరిని వరించనున్నాయన్న దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వె లువడలేదు.
 
 అయితే పార్టీ వర్గాల సమాచారం మేరకు... చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన బొంతు రామ్మోహన్‌ను మేయర్ పదవికి, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌ను డిప్యూటీ మేయర్ పదవికి దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి పేర్లను పార్టీ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గురువారం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగనుంది. అంతకంటే ముందు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు.
 
 నేడు కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక భేటీ
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు కూడా తీసుకున్న మంత్రి కేటీఆర్... టీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో గురువారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని అన్నీ తానై వ్యవహరించిన కేటీఆరే మేయర్ ఎన్నికల బాధ్యతను కూడా చూస్తున్నారు. మరోవైపు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పేర్లను ఖరారు చేశారని చెబుతున్నారు. గురువారం ఉదయం జరిగే కార్పొరేటర్ల సమావేశంలో వారి పేర్లను ప్రకటించే అవకాశముంది. ఈ భేటీ తర్వాత కార్పొరేటర్లంతా జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి చేరుకుంటారు. పదకొండు గంటలకు జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ ఎన్నికకు సంబంధించి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు టీఆర్‌ఎస్ బుధవారం విప్ జారీ చేసింది.
 
 ఏకగ్రీవమే
నూటా యాభై డివిజన్లు ఉన్న జీహెచ్‌ఎంసీలో సగానికిపైగా అంటే 76 డివిజ న్లను గెలుచుకున్న పార్టీ మేయర్ స్థానానికి సరిపడా మెజారిటీ సాధించినట్లు లెక్క. టీఆర్‌ఎస్ ఏకంగా 99 డివిజన్లలో గెలుపొందింది. టీడీపీ ఒక స్థానంలో, కాంగ్రెస్ రెండు, బీజేపీ నాలుగు, ఎంఐఎం 44 స్థా నాల్లో గెలుపొందాయి. అంటే టీఆర్‌ఎస్ మినహా ఏ ఇతర పార్టీ పోటీపడే అవకాశం లేకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశముంది.

ఈ ఎన్నికలో జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషి యో సభ్యులుగా ఓట్లున్న ఎమ్మెల్యేలు, ఎం పీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీల ఓట్లు అవసరం ఉండడం లేదు కూడా. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో 67 ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓట్లున్నాయి. వారి ఓట్లనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 217 ఓట్లు అవుతున్నాయి. టీఆర్‌ఎస్‌కే అత్యధికంగా 35 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులున్నారు. వీరినీ కలుపుకొంటే టీఆర్ ఎస్ ఏకంగా 134 ఓట్లతో ఇతర పార్టీలకు అందనంత దూరంలో ఉంది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక లాంఛనప్రాయమే .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement