ఐటీ పరిధికి వస్తే... సబ్సిడీ కట్‌! | IT begins scrutiny on LPG subsidy by diposits limits | Sakshi

ఐటీ పరిధికి వస్తే... సబ్సిడీ కట్‌!

Dec 7 2016 10:58 AM | Updated on Sep 27 2018 4:07 PM

ఐటీ పరిధికి వస్తే... సబ్సిడీ కట్‌! - Sakshi

ఐటీ పరిధికి వస్తే... సబ్సిడీ కట్‌!

బ్యాంక్‌ ఖాతాలో పరిమితికి మించి డిపాజిట్‌ చేసి..ఆదాయ పన్ను(ఐటీ) పరిధిలోకి వచ్చారో..? ఆహార భద్రత (రేషన్) కార్డు, గ్యాస్‌ సబ్సిడీపై వేటుపడటం ఖాయం.

♦ రంగంలోకి దిగిన పౌరసరఫరాల శాఖ
♦  ఆధార్‌ అనుసంధానంగా బ్యాంక్‌ ఖాతాలపై ఆరా
♦  డిపాజిట్ల పరిమితి మించితే రేషన్ కార్డు, గ్యాస్‌ సబ్సిడీ కట్‌..

హైదరాబాద్:
బ్యాంక్‌ ఖాతాలో పరిమితికి మించి డిపాజిట్‌ చేసి..ఆదాయ పన్ను(ఐటీ) పరిధిలోకి వచ్చారో..? ఆహార భద్రత (రేషన్) కార్డు, గ్యాస్‌ సబ్సిడీపై వేటుపడటం ఖాయం. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆహార భద్రత లబ్ధిదారులు, గ్యాస్‌ వినియోగదారులపై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. ఆధార్‌ అనుసంధానం ఆధారంగా బ్యాంక్‌ ఖాతాల్లోని డిపాజిట్‌ వివరాలు ఆరా తీసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బ్యాంక్‌ ఖాతాలపై దృష్టి సారించిన ఆదాయ పన్నుశాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. పెద్ద నోట్ల రద్దు, కరెన్సీలపై ఆంక్షల నేపథ్యంలో  నిరుపేదల ఖాతాల్లో సైతం భారీగా డిపాజిట్లు వచ్చి చేరాయి. కేవలం జన్ధన్ కు సంబంధించిన సుమారు 17.49 లక్షల ఖాతాల్లోనే దాదాపు రూ.900 కోట్ల డిపాజిట్‌ ఉన్నట్లు సమాచారం. వీరంతా దాదాపు ఆహార భద్రత లబ్ధిదారులు, గ్యాస్‌ వినియోగదారులే. వాస్తవంగా కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల ఆదాయం మించితే ఆహార భద్రత కార్డుకు, రూ.10 లక్షలు మించితే గ్యాస్‌ కనెక్షన్పై సబ్సిడీకి అనర్హులవుతారు. ఇప్పటికే స్వంత ఇళ్లు, వాహనం, వ్యాపారం కలిగి ఉండి  వివిధ పన్ను పరిధిలోకి వచ్చిన కుటుంబాలకు సంబంధించిన ఆహార భద్రత కార్డులపై పౌరసరఫరా శాఖ వేటు వేసింది.

ఇక చమురు సంస్థలు ఆదాయ వర్గాలు సబ్సిడీ వదులుకోవాలని గత రెండేళ్లుగా గీవ్‌ ఇట్‌ అప్‌పై విసృతంగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు రెండున్నర లక్షల కార్డులపై అనర్హత వేటుపడగా. దాదాపు 8 వేల కుటుంబాలు గ్యాస్‌ కనెక్షన్లపై సబ్సిడీ వదులుకున్నారు. తాజాగా పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో అనర్హులను గుర్తించి వేటు వేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది.

ఇదీలెక్క...
గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 11 లక్షలకు పైగా ఆహార భద్రత కార్డులు, సుమారు 29.18 లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే ఆహార భద్రత కార్డుల ఆధార్‌ నంబర్లతో, గ్యాస్‌ కనెక్షన్లు  ఆధార్, బ్యాంక్‌ ఖాతాలతో అనుసంధానమయ్యాయి. దీంతో కుటుంబ వార్షికాదాయం, ఆర్థిక పరిస్థితి దాచిపెట్టినప్పటికి ఆధార్‌ అనుసంధానం ఆధారంగా బ్యాంక్‌ ఖాతాలోని డిపాజిట్‌లు  వివరాలు బయటపడే అవకాశాలు లేకపోలేదు. అసలైన నిరుపేదలకు సబ్బిడీ వర్తింపజేయలన్న ప్రధాని ఆకాంక్షలకు  అనుగుణంగా అనర్హులను గురించే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆదాయ పన్నుల శాఖ బ్యాంక్‌ ఖాతాలపై దృష్టి సారించి పరిమితికి మంచి ఉన్న డిపాజిట్‌ లపై నోటీసులు ఇచ్చేందుకు సిద్దపడుతుండటంతో నోటీసులు సైతం పరిగణలోకి తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ సమయత్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement