
ప్రభుత్వ అవినీతి కంపుకొడుతోంది
∙ తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
∙ భూకబ్జాల వెనుక పాలకుల హస్తం
∙ ఈనెల 21న అమరవీరుల స్ఫూర్తియాత్ర
హయత్‌నగర్(ఇబ్రహీంపట్నం): టీఆర్‌ఎస్ సర్కార్ పాలన అవినీతిమయంతో కుళ్లిన కంపు కొడుతుందని, ఇంతటి అవినీతి పాలనను ఎప్పుడూ చూడలేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ఆదివారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయాంజాల్‌లో జరిగిన టీజేఏసీ విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకుంది ఇలాంటిపాలన కోసం కాదన్నారు. సీమాంధ్ర పాలనకు కొనసాగింపుగా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అత్మహత్యలకు పాల్పడుతున్నా, ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.
విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదలకు డబుల్ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఊరిస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. భూ కుంభకోణాలు ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతున్నాయని, వీటిలో అధికారులతో పాటు పాలకుల హస్తం కూడా ఉందని అన్నారు, నయీం కేసులోని డైరీలో కొన్ని పేజీలు చిరిగి పోయాయని, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయన్నారు. గ్రూప్–2 పరీక్షలలో పారదర్శకత లోపించిందని, ఎస్‌ఐ రాత పరీక్షల ఫలితాల ఇంకా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న అమరుల స్ఫూర్తి యాత్రను చేపట్టనున్నామని స్పష్టం చేశారు. యాత్ర సంగారెడ్డిలో మొదలై.. సిద్ధిపేటలో ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ రఘు, కో–చైర్మన్ పురుషోత్తం, కో– కన్వీనర్‌లు శంకర్, రమేష్, అధికార ప్రతినిధి గురిజాల రవీందర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
స్ఫూర్తి యాత్ర నిర్వాహణ కమిటీ ఏర్పాటు..
ఈ నెల 21 నుంచి జేఏసీ చేపట్టిన స్ఫూర్తి యాత్ర నిర్వాహణకు సమావేశంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా జె.రఘు, కో–చైర్మన్‌గా ఇటిక్యాల పురుషోత్తం, నిజామాబాద్ జిల్లా కో–ఆర్డినేటర్‌గా గోపాలశర్మ, నల్లగొండ జిల్లా కో–ఆర్డినేటర్‌గా ధర్మార్జున్, మెదక్ జిల్లా కో–ఆర్డినేటర్‌గా అశోక్, వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్‌గా అంబటి శ్రీనివాస్, స్టీరింగ్ కమిటీ సభ్యులుగా కన్నెగంటి రవి, కో–కన్వీనర్‌గా బైరి రమేష్‌లు వ్యవహరిస్తారని సమావేశం తీర్మానించింది.