సస్పెన్షన్లు ఎత్తేస్తే విధుల్లోకి...!
న్యాయాధికారులు, ఉద్యోగుల యోచన
- సీజేఐ హామీ నేపథ్యంలో తర్జనభర్జనలు
- వారిని పిలిపించి మాట్లాడిన గవర్నర్
- వెంటనే విధుల్లో చేరాలని స్పష్టీకరణ
- సస్పెన్షన్ ఎత్తివేతపై హామీ ఇవ్వని వైనం
- ఆందోళనలు కొనసాగుతాయంటూ జేఏసీ వ్యాఖ్యలు
- న్యాయాధికారుల సంఘం చర్చలు.. నేడూ భేటీ!
- వారి సెలవు దరఖాస్తులను తిరస్కరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు రూపొందించిన న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాపై కొద్ది రోజులుగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు, సమ్మె చేస్తూ వస్తున్న తెలంగాణ న్యాయాధికారులు, న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులు ఇప్పుడు సస్పెన్షన్ల ఎత్తివేతపై దృష్టి సారించారు. న్యాయాధికారుల సంఘం, న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం నేతలపై హైకోర్టు విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే ఆందోళనలను, సమ్మెను విరమించి విధుల్లో చేరే దిశగా యోచన చేస్తున్నారు. వెంటనే విధుల్లో చేరాలని, ప్రాథమిక కేటాయింపుల జాబితా విషయాన్ని తాను చూసుకుంటానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇంకా సెలవుల్లోనే కొనసాగడం సబబేనా అని వారు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఆందోళనలు విరమించి వెంటనే విధుల్లో చేరాల్సిందేనని సోమవారం గవర్నర్ నరసింహన్ కూడా స్పష్టం చేయడంతో న్యాయాధికారులు సెలవులను కొనసాగించడంపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. అయితే సస్పెన్షన్ ఎత్తివేతపై హైకోర్టు నుంచి సంకేతాలేమీ రాకపోవడంతో ఉద్యమ కార్యాచరణపై వారు తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. సెలవులను కొనసాగించడమా, సీజేఐ, గవర్నర్ సూచించినట్టు విధుల్లో చేరడమా అన్నదానిపై న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు సోమవారం రాత్రి సమావేశమై పొద్దుపోయేదాకా చర్చించారు. ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియరాలేదు. మంగళవారం న్యాయాధికారులంతా సమావేశమై పూర్తిస్థాయి చర్చల అనంతరం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. సస్పెన్షన్ల ఎత్తివేతపై నిర్దిష్టమైన హామీ ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించినందున తమ ఆందోళనలు కొనసాగుతాయని న్యాయవాదుల సంఘం, జేఏసీ నేతలు మౌఖికంగా చెప్పడం విశేషం.
న్యాయాధికారులతో గవర్నర్ చర్చలు
సోమవారం సాయంత్రం న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కె.రవీందర్‌రెడ్డి, వరప్రసాద్, చంద్రశేఖరప్రసాద్, సుబ్బయ్య, లకా్ష్మరెడ్డి తదితరులను గవర్నర్ రాజ్‌భవన్‌కు పిలిపించి అరగంటకు పైగా చర్చించారు. సీజేఐ స్పష్టమైన హామీ ఇచ్చాక కూడా విధులకు దూరంగా ఉండటం సరికాదని న్యాయాధికారులకు, న్యాయవాదులకు ఆయన స్పష్టం చేసినట్లు తెలి సింది. ఇన్నేళ్లుగా ఎప్పుడైనా ఇలా న్యాయాధికారులు ఆందోళనలు చేయడం చూశారా అని వారిని ప్రశ్నించిన గవర్నర్, వెంటనే విధుల్లో చేరితే సమస్యలన్నీ సర్దుకుంటాయని సూచించారు. న్యాయాధికారులు సెలవులపై ఉండటం సరికాదని, కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారు గనక వెంటనే విధుల్లో చేరాలని కోరినట్టు తెలిసింది. కేటాయింపుల జాబితాపై ఆందోళన వద్దని, అభ్యంతరాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని వారికి గవర్నర్ చెప్పారు. తమ సస్పెన్షన్ల ఎత్తివేత గురించి ప్రస్తావించగా, దానిపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలవాలని సూచించారు.
న్యాయవాదులకు హామీ ఇవ్వని గవర్నర్
న్యాయాధికారులు కలవడానికి ముందు గవర్నర్‌ను న్యాయవాదుల జేఏసీ నేతలు కన్వీనర్ ఎం.రాజేందర్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు నేతృత్వంలో కలసి వినతిపత్రం సమర్పించారు. న్యాయాధికారులు, న్యాయ శాఖ ఉద్యోగుల సస్పెన్షన్ల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ దీనిపై గవర్నర్ హామీ ఇవ్వలేదని, ముందు ఆందోళనలు, సమ్మెలు విరమించి విధుల్లో చేరాలని స్పష్టం చేశారని విశ్వసనీయంగా తెలిసింది. దాంతో, గవర్నర్‌తో భేటీ తరువాత బయటకు వచ్చిన నేతలు తమ ఆందోళనలు కొనసాగుతాయని మౌఖికంగా చెప్పి వెళ్లిపోయారు.
వరప్రసాద్ అమెరికా టూర్‌కు అనుమతి రద్దు
సస్పెన్షన్‌కు గురైన న్యాయాధికారుల సంఘం కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా జడ్జి వి.వరప్రసాద్ అమెరికా పర్యటనకు గతంలో ఇచ్చిన అనుమతిని హైకోర్టు రద్దు చేసింది. నగరం దాటరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో షరతు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
న్యాయాధికారుల సెలవు దరఖాస్తులు తిరస్కృతి
న్యాయాధికారులు మూకుమ్మడి సెలవుల కోసం పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 27 నుంచి మూకుమ్మడి సెలవులపై వెళ్లాలని నిర్ణయించుకున్న న్యాయాధికారులు తమ యూనిట్ హెడ్‌లకు సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సెలవుల మంజూరు అధికారాన్ని జిల్లా జడ్జీల నుంచి ఉపసంహరించి తన వద్దే అట్టిపెట్టుకుంది. దాంతో న్యాయాధికారుల సెలవు దరఖాస్తులన్నీ హైకోర్టుకు చేరాయి. తెలంగాణలో పది జిల్లాల్లోని 100కు పైగా న్యాయాధికారులు, కర్నూలులో పనిచేస్తున్న ఇద్దరు తెలంగాణ న్యాయాధికారులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించిన హైకోర్టు, వాటన్నింటినీ తిరస్కరిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది.