తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్: రాజకీయాల్లో జేఏసీ జోక్యం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని, ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఈ నెల 4 తర్వాత దీనిపై విధి విధానాలు ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా బొంగ్లూర్‌లో బుధవారం జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని కాపాడుకోవడానికి జేఏసీ కార్యాచరణ రూపొందిస్తుందన్నారు.
రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పాత పది జిల్లాల్లో పర్యటించిన తర్వాత ఈ నెల 4న తుర్కయంజాల్‌లో సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రస్తుత రాజకీయాలు సమాజాభివృద్ధికి దోహదపడటం లేదని, ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన ద్రోహులు అధికారంలో ఉన్నారని విమర్శించారు. ఈ సదస్సుకు జేఏసీ రంగారెడ్డి జిల్లా చైర్మన్ వెదిరె చల్మారెడ్డితో పాటు జిల్లా నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, కొత్త రవి తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment