‘ఊత పదాలు కాదు...హుందాగా వ్యవహరించాలి’
హైదరాబాద్ : ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో టీఆర్ఎస్ సర్కారు ప్రతిపక్ష కాంగ్రెస్‌ను విమర్శించడాన్ని తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తప్పుపట్టారు. ప్రశ్నిస్తే జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సరికాదని ఆయన అన్నారు. జానారెడ్డి గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని ఆయన అన్నారు.
ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలని తాను ఇరిగేషన్ మంత్రికి, కార్యదర్శికి లేఖ రాస్తే ఇప్పటి వరకూ సమాధానం లేదన్నారు. రెండేళ్లలో రెండు పంటలకు నీరిస్తామని చెప్పిన కేసీఆర్ అది చేసి చూపించగలరా అని ప్రశ్నించారు. అంచనాలు పెంచి ప్రాజెక్టులు కట్టిస్తున్న టీఆర్‌ఎస్ సర్కారు తీరును ప్రజలు గమనిస్తున్నారని.. సరైన సమయంలో బుద్ధి చెబుతారని జానారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రాజెక్టుల రీ డిజైన్ వల్ల రాష్ట్రంపై 50 నుంచి 60వేల కోట్ల భారం పడుతుందన్నారు. గతంలో తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టును తాము ప్రతిపాదించామన్నారు. తమ ప్రతిపాదనను మహారాష్ట్ర ప‍్రభుత్వం పరిశీలిస్తామందని, ఆ ప్రతిపాదనపై కేసీఆర్ చర్చించకుండా 148 అడుగులకు ఒప్పందం కుదుర్చుకోవడం చారిత్రక తప్పిదం కాదా? అని జానారెడ్డి ప్రశ్నించారు. లోపాలను ఎత్తిచూపే బాధ్యత ప్రతిపక్షంగా తమకు హక్కు ఉందన్నారు. టెండర్లు పారదర్శకంగా జరగకపోవడంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం తన పాదర్శకతను నిరూపించుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ చెప్పిన అంశాలను నివృత్తి చేయకుండా కేసీఆర్ ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారన్నారు. వ్యక్తులను టార్గెట్ చేయడం సరికాదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అధికార దర్పంతో మాట్లాడటం సీఎం హోదాకు తగదన్నారు. సీఎం ఉన్న వ్యక్తి ఊతపదాలు కాదని, హుందాగా వ్యవహరించాలన్నారు. గతం అంటూ గందరగోళం చేయడం కాదని, ఇప్పుడేమి చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
నీళ్ళు ఇస్తే ప్రభుత్వానికి ప్రచారం చేస్తానని మాట నిలబెట్టుకుంటానని..మాటకు మాట మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనన్నారు. కేసీఆర్ చేస్తున్న అవక తవకలను సరిదిద్దడం దేవుడి తరం కూడా కాదన్నారు. గద్వాల పై ప్రజల అభిప్రాయం బలంగా వినిపిస్తున్నారని, పెద్ద జిల్లా అయిన పాలమురును 4 జిల్లాలు చేయలని జానారెడ్డి సూచించారు.