![జయశంకర్ సహకారంతోనే ఎదిగా](/styles/webp/s3/article_images/2017/09/3/81439925486_625x300.jpg.webp?itok=h_2Gys_2)
జయశంకర్ సహకారంతోనే ఎదిగా
ఆచార్య దేవోభవ పురస్కార ప్రదాన సభలో ప్రొ. కోదండరాం
హైదరాబాద్: నిబద్ధతకు మారుపేరుగా కీర్తిగడించిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పేరిట ఏర్పాటు చేసిన ‘ఆచార్య దేవోభవ’ పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆయన సహకారంతోనే ఎదిగానని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారంరాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగిన జయశంకర్ జయంతి ఉత్సవాల్లో కోదండరామ్‌కు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ చలువతోనే తానింతటిస్థాయికి చేరినట్లు చెప్పారు.
ఆయన సహకారంతోనే విద్యావంతుల వేదికకు అధ్యక్షుడు, రాజకీయ జేఏసీకి చైర్మన్‌గా నియమితులయ్యానన్నారు. నమ్మిన ఆశయాల కోసం జయశంకర్ నిబద్ధతతో పని చేసేవారని కొనియాడారు. రమణాచారి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కోదండరామ్ విజయం సాధించారని, ఇప్పుడు తెలంగాణ పునర్‌నిర్మాణానికి చేయూతనివ్వాలని కోరారు. కార్యక్రమంలో వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.