
16 ఏళ్ల కిందటే జయ వీలునామా!
- రక్తసంబంధీకురాలి పేరిట రిజిస్ట్రేషన్?
- మరో రెండు ట్రస్టులు కూడా..
- హైదరాబాద్ శివారులోని జేజే గార్డెన్స్ చిరునామాతోనే రిజిస్ట్రేషన్
- ప్రైవేటు అటెండెన్స్ ద్వారా ప్రక్రియ పూర్తి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన వందలాది కోట్ల ఆస్తులకు వారసురాలు ఎవరు? ఆమె ఎవరి పేరిటైనా ఇప్పటికే వీలునామా రాశారా? జయలలిత మరణం తర్వాత ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్నలివి! అయితే 16 ఏళ్ల కిందటే జయ తన రక్తసంబంధీకురాలిపై వీలునామా రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు హైదరాబాద్‌లోని జేజే గార్డెన్స్ చిరునామాతో మరో రెండు ట్రస్టులను కూడా ఆమె రిజిస్టర్ చేశారు. వీలునామా ఎవరి పేరిట రాశారన్న సంగతి మాత్రం తెలిసే వీలు లేదని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధన ప్రకారం ‘బుక్ 3’లో నమోదైన వీలునామా సమాచారాన్ని రాసిన వారసురాలు (లీగల్ హెయిర్)కు మినహా ఇతరులకు వెల్లడించేందుకు వీలు కాదని పేర్కొంటున్నారు.
ఇక్కడి చిరునామాతోనే..
వీలునామాతోపాటు రెండు ట్రస్ట్‌లను కూడా జయలలిత 2000 జూలై 14న రిజిస్ట్రేషన్ చేశారని తెలుస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియంతా హైదరాబాద్ నగర శివారులోని జేజే గార్డెన్స్‌లో జరిగింది. నాడు జయలలిత ప్రతిపక్షంలో ఉన్నారు. వీలునామా, ట్రస్ట్‌ల రిజిస్ట్రేషన్‌ను తమిళనాడు చిరునామాతో కాకుండా హైదరాబాద్(పేట్ బషీరాబాద్)లోని తన గార్డెన్స్ చిరునామాతో చేయించారు. ‘పురట్చి తలైవి బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్, నమద్ ఎంజీఆర్ బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్’లను (డాక్యుమెంట్ నంబర్లు బుక్ 4లో 31, 32) రిజిస్ట్రేషన్ చేశారు. ఆ ట్రస్టుల నిర్వాహకులుగా జయలలిత తన పేరుతోపాటు తన నెచ్చెలి శశికళ, దినకరన్, భాస్కరన్, భువనేశ్వరి పేర్లను చేర్చారు. ఆపై 2001లో ట్రస్ట్ నిబంధనల్లో స్వల్ప సవరణలు చేశారు. ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలకు ముందుగానే ఆదాయపు పన్ను శాఖ అనుమతి తీసుకుంటామని, అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించమని సవరణ పత్రాల్లో పేర్కొన్నారు. ఆపై జయలలిత ఆస్తుల కేసు విచారణ సందర్భంగా సీబీఐ, న్యాయస్థానాలకు కూడా సదరు రిజిస్ట్రేష్లన్ల పత్రాలను సమర్పించినట్లు తెలిసింది.
ప్రైవేట్ అటెండెన్స్ ద్వారా..
సాధారణంగా ఏదైనా ఆస్తులు, ట్రస్టులను రిజిస్టర్ చేయాలనుకునే వారు తప్పనిసరిగా తమ చిరునామాకు సమీపంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విధిగా హాజరు కావాలి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రైవేట్ అటెండెన్స్ ద్వారా సబ్ రిజిస్ట్రారే వినియోగదారుల వద్దకు వెళ్లి ఆ తంతును పూర్తి చేసే వెసులుబాటు ఉంది. ప్రజా జీవితంలో ఉన్న సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, మావోయిస్టుల నుంచి హాని ఉన్నవారు, నడవలేనివారు, ఆరోగ్యం బాగోలేని వారు ప్రైవేట్ అటెండెన్స్ సదుపాయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు వ్యక్తులు తెలిపిన కారణాలను పరిశీలించిన సబ్ రిజిస్ట్రార్ సంతృప్తి చెందితే ఒక్కో రిజిస్ట్రేషన్‌కు అదనంగా రూ.500 ఫీజుతో ప్రైవేట్ అటెండెన్స్ రిజిస్ట్రేషన్‌కు వెళ్లవచ్చు. నాడు మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ స్వయంగా జేజే గార్డెన్స్‌కు వెళ్లి జయలలిత సంతకాలు తీసుకొని ఇలాగే రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. సదరు సబ్ రిజిస్ట్రార్ పదవీ విరమణ చేసినప్పటికీ జయలలిత ఆస్తుల కేసు విచారణ సమయంలో పలుమార్లు సీబీఐ, న్యాయస్థానాల ఎదుట హాజరైనట్లు తెలిసింది.