జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.30 కోట్లు | Journalists welfare fund of Rs 30 crore | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.30 కోట్లు

Published Sat, Feb 18 2017 1:51 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.30 కోట్లు - Sakshi

జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.30 కోట్లు

‘జనహిత’లో సీఎం కేసీఆర్‌ వెల్లడి
మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా
రూ.లక్ష చెక్కుల పంపిణీ.. మూడేళ్ల పాటు పెన్షన్‌
ఇళ్లు లేనివారికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: తన జన్మదినం సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాలు ప్రకటించారు. ప్రతి ఏటా బడ్జెట్‌ నుంచి జర్నలిస్టు సంక్షేమ నిధికి ఇచ్చే నిధులను ఈసారి మూడింతలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.10 కోట్ల చొప్పున రెండేళ్లుగా సంక్షేమ నిధికి జమ చేశామని, ఈసారి బడ్జెట్‌లో రూ.30 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. శుక్ర వారం సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌ లో తొలిసారి ‘జనహిత’ కార్యక్రమం నిర్వహించారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో సీఎం ఈ సందర్భంగా సమావేశ మయ్యారు. వారి బాధలు, దుఃఖాన్ని పంచుకున్నారు. ఎలాంటి ఆధారం లేని కుటుంబా లను ఆదుకుంటామని, సమస్యలను పరిష్క రిస్తామన్నారు. ఈ సందర్భంగా 84 మంది బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆర్థికసాయం అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.

బాధ్యతగా తీసుకొంటాం...
‘భారత జవాన్లకు దేశానికి కాపలా కాస్తుంటే మనం ఇక్కడ సంతోషంగా బతుకుతున్నాం. వారి సంక్షేమానికి  రూ.80 కోట్లతో నిధిని పోగు చేశాం. జవాను బతికినా..చనిపోయినా  వారి కుటుంబానికి అండగా ఉండే బాధ్యతను తీసుకున్నాం. సమాజాన్ని చైతన్య పరుస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కూడా బాధ్యతగా స్వీకరించాలి. రెండేళ్లలో రూ.10 కోట్ల చొప్పున రూ.20కోట్లు ఇచ్చాం. వచ్చే నెలలో ప్రవేశపె ట్టే బడ్జెట్‌లో మరో రూ.30 కోట్లు మంజూరు చేస్తాం. దీంతో ఈ నిధి రూ.50 కోట్లు అవుతుంది. రక్షణ కవచంగా మిగులుతుంది. తిరుపతికి వెళితే దేవుడి దగ్గర హుండీలో డబ్బులు వేస్తాం. అవి సత్కార్యానికి సద్విని యోగమవుతాయనే విశ్వాసం.

తిరుపతి హుండీలాగే అల్లం నారాయణకు డబ్బులిస్తే నమ్మకం నాకుంది. భవిష్యత్తులో సంక్షేమ నిధి మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. దేశానికే తలమానికంగా ఉంటాం’’ అని సీఎం అన్నారు. జర్నలిస్టులకు ఆర్థిక భారమైన ఆరోగ్య సమస్యలుంటే ప్రెస్‌ అకాడ మీని సంప్రదించి వారి ద్వారా తన దృష్టికి తేవాలని సీఎం సూచించారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ హరికిషన్‌రెడ్డి గుండె మార్పిడికి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే కార్యక్రమం ద్వారా ‘జనహిత’ ప్రారంభించాలనుకున్నామని, మొట్టమొదటే ఇంతమంచి కార్యక్రమం చేప ట్టినందుకు ప్రెస్‌ అకాడమీకి కృతజ్ఞతలు తెలి యజేశారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఎంపీ మల్లారెడ్డి,  సమాచార శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, జర్నలిస్టు సంఘం నేతలు పల్లె రవికుమార్, క్రాంతి కిరణ్‌ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన సాక్షి టీవీ స్పోర్ట్స్‌ జర్నలిస్టు శ్రీనివాసులు కుటుంబానికి సీఎం రూ.4లక్షల ఆర్థిక సాయం అందజేశారు.  

పెళ్లీడు అమ్మాయిలుంటే రూ.3 లక్షలు
‘‘ఎంతో కష్టపడి, పోరాడి తెలంగాణ సాధించుకున్నాం.తెలంగాణ పేద రాష్ట్రం కాదు. ధనిక రాష్ట్రం కాదు. రాష్ట్రంలో పేదరికం, దుఃఖం అంతం కావాలి. జర్నలిస్టు కుటుంబాల విజ్ఞప్తులు విన్న తర్వాత చాలా హృదయ విదారకంగా అనిపించింది. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి రూ.లక్ష కాకుండా గౌరవంగా బతకడానికి ఐదేళ్ల పాటు రూ.3 వేల పెన్షన్, చదువుకునే పిల్లలుంటే నెలకు వెయ్యి చొప్పున ప్రెస్‌ అకాడమీ తరపున ఇస్తున్నాం. కొంతమందికి ఇళ్లు లేవని ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు లేని వారికి రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తాం. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాల్లో పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలుంటే వారి పెళ్లి ఖర్చులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.3 లక్షల ఆర్థిక సహాయం తక్షణమే అందిస్తాం’’ అని సీఎం ప్రకటించారు.

సీఎం జర్నలిస్టుల పక్షపాతి: టీయూడబ్ల్యూజే  
మరణించిన జర్నలిస్టుల కుటుంబాలతో జనహిత మొట్టమొదటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా సీఎం మరోసారి జర్నలిస్టు పక్షపాతి అని నిరూపించుకున్నారని టీయూడబ్ల్యూజే జనరల్‌ సెక్రటరీ క్రాంతి కిరణ్‌ అన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన వారికి ఆర్థిక సాయాన్ని అందజేయడం పట్ల శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలు ఎంతో ఓపికతో విని, వాటన్నింటినీ పరిష్కారిస్తానని వేదికపైనే ప్రకటించడం, వెల్ఫేర్‌ ఫండ్‌కు రూ.30 కోట్లు కేటాయించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నామని క్రాంతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement