
ఆద్యంతం ఆనందం..
సిటీ ప్రజల ఆదరణ పొందిన ‘రాహ్‌గిరి’ ఆదివారం ‘డ్రామాగిరి’గా మారింది. వరల్డ్ థియేటర్ డేను పురస్కరించుకొని రాహ్‌గిరిలో నిశుంభిత ఆధ్వర్యంలో థియేటర్ ఆర్టిస్ట్, రచయిత, డెరైక్టర్ అయిన డాక్టర్ రామ్మోహన్ హొలంగుడి పర్యవేక్షణలో రోడ్డు భద్రతపై వీధి నాటకాన్ని ప్రదర్శించారు. రచయిత ఉమా కిరణం ‘మహిళా సాధికారత’పై ప్రదర్శించిన నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్లాష్ మాబ్, సైకుల్ పర్యవేక్షణలో సైక్లింగ్, అభిమానిక, వేణు ఆధ్వర్యంలో జుంబా డాన్స్, ఫిట్‌జాబ్ ద్వారా ఫిట్‌నెస్, నావిగో స్ట్రీట్ గేమ్స్‌తో రాహ్‌గిరి ఆద్యంతం ఆనందాన్ని పంచింది. చిన్నపిల్లలతో తల్లిదండ్రులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ఇందులో పాలుపంచుకోవడం విశేషం. - రాయదుర్గం