జూనియర్ ను కొట్టి చంపిన సీనియర్ విద్యార్థులు
హైదరాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు కొట్టి చంపిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అమ్మాయి విషయంలో తలెత్తిన వివాదమే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, కొట్టిన దెబ్బల తోనే మృతి చెందాడని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొనడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. వివరాలు ఇలా ... సఫిల్‌గూడకు చెందిన ఎన్.మల్లేశ్‌గౌడ్, నిర్మల దంపతుల కుమారుడు యశ్వంత్‌గౌడ్(19) దూలపల్లిలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. నవంబర్ 9 తెల్లవారుజామున ఇంటికి సమీపంలోని స్నేహితుడు వాకింగ్‌కు రమ్మని యశ్వంత్‌కు ఫోన్ చేయగా (ఏపీ28 3837) హీరోహోండా బైక్‌పై వెళ్లాడు.
ఉదయం 7.20 నిమిషాలకు సఫిల్‌గూడలో ఉంటున్న మరో విద్యార్థి.. అపస్మారకస్థితిలో ఉన్న యశ్వంత్‌ను వాహనంపై అతడి ఇంటికి తీసుకొచ్చాడు. సఫిల్‌గూడ చెరువుపై లారీ, బైక్‌ను ఢీ కొట్టడంతో గాయపడ్డాడని అతడి తండ్రి మల్లేశ్‌గౌడ్‌కు చెప్పి వాహనాన్ని అప్పగించి వెళ్లిపోయాడు. యశ్వంత్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో చిన్న ప్రమాదమే అనుకున్నారు. కొద్దిసేపటికి కడుపులో నొప్పిగా ఉందని అనడంతో ఏడీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా తగ్గకపోవడంతో మహాలక్ష్మి నర్సింగ్ హోంకు తీసుకెళ్లారు. ఛాతి, కడుపు, ఎక్స్‌రే తీయించారు. కడుపులో బలమైన గాయాలయ్యాయని పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు చెప్పడంతో యశోదకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడు.
రోడ్డు ప్రమాదంగా కేసు..
తోటి విద్యార్థులు చెప్పిన వివరాల మేరకు నేరేడ్‌మెట్ పోలీసులు రోడ్డు ప్రమాదం కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు అందుకు విరుద్ధంగా వచ్చింది. కడుపు, ఛాతి, మూత్రపిండాలు, తల వెనుక భాగం చిన్న మెదడులో రక్తప్రసరణ ఎక్కడికక్కడే నిలిచిపోయిందని వైద్యులు నివేదిక ఇచ్చారు. తొలుత సఫిల్‌గూడ చెరువుపై ప్రమాదం జరిగిందని తెలిపిన విద్యార్థులు తర్వాత ప్యారడైజ్ ఫ్లైఓవర్‌పై ఘటన జరిగిందని పేర్కొనడంతో కేసును మహంకాళి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.
మా బిడ్డను చంపారు..
యశ్వంత్‌ను పథకం ప్రకారం కొంతమంది విద్యార్థులు కొట్టి చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు. మత్తు మందు ఇచ్చి బయటికి కనిపించని విధంగా బలమైన దెబ్బలు కొట్టారని, అదే పోస్టుమార్టం నివేదికలో ఉందన్నారు. టీ షర్టుపై కూడా బూటు కాలు ముద్రలున్నాయని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య కేసుగా నమోదు చేసి, నిందితులను శిక్షించాలని మృతుడి తల్లిదండ్రులు నగర సీపీ ఎం.మహేందర్‌రెడ్డిని కోరారు.
ప్రేమ వ్యవహారమే కారణమా?
ఓ విద్యార్థిని విషయంలో యశ్వంత్‌కు కళాశాలలో చదువుతున్న సీనియర్లతో వివాదం ఉన్నట్టు తెలుస్తోంది. సంఘటనకు ముందురోజు సదరు విద్యార్థినికి వాట్సప్ మెసేజ్ పంపాడు. ఈ విషయమై నవంబరు 8న కళాశాల నుంచి ఇంటికి వచ్చే సమయంలో కృపా కాంప్లెక్స్ వద్ద సీనియర్ విద్యార్థులతో గొడవ జరిగినట్టు తెలి సింది. దాడిలో 10 మంది వరకు పాల్గొన్నారని, వారిని విచారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని మృతుని తండ్రి మల్లేశ్ పోలీసులను కోరారు.