Junior student
-
జూనియర్‌పై సీనియర్ విద్యార్థుల దాడి
-
అమ్మాయి పక్కన సీటు కోసం రక్తమొచ్చేలా...
కోల్‌కతా : సినిమాల్లో చూపించే మాదిరిగా ఓ ఇద్దరు విద్యార్థులు స్కూల్ బస్సులో అమ్మాయి పక్కన సీటు కోసం రక్తమొచ్చేలా కొట్టుకున్నారు. ఇక సీనియర్ విద్యార్థి అయితే ఏకంగా జూనియర్ విద్యార్థిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది. సీనియర్ విద్యార్థి దాడిలో తీవ్ర గాయాలు పాలైన జూనియర్ వెనువెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అసలేం జరిగింది.. సాయంత్రం 4.45కు స్కూల్ అయిపోయిన తర్వాత విద్యార్థులందరూ తమ ఇళ్లకు వెళ్లడానికి స్కూల్ బస్సు ఎక్కారు. క్లాస్ 11 విద్యార్థి అమ్మాయి పక్కన సీటులో కూర్చోవాలనుకున్నాడు. కానీ ఆమె పక్కన ఉన్న సీటులో క్లాస్ 10 విద్యార్థి కూర్చున్నాడు. అయితే ఆ అమ్మాయి తన గర్ల్‌ఫ్రెండ్ అని వెంటనే ఆ సీటులోంచి లేచి వేరే సీటులో కూర్చోవాలని జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థి బెదిరించాడు. కానీ సీనియర్ బెదిరింపులకు ఏ మాత్రం తలొగ్గని జూనియర్, సీటును ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో ఆ ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ చిలికి చిలికి తీవ్ర స్థాయిగా మారింది. వారిద్దరి మధ్య తగాదాను తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. ఆ సమయంలోనే స్కూల్ గేట్ నుంచి బస్సు కూడా ప్రారంభమైంది. పలుమార్లు డ్రైవర్ చెప్పినప్పటికీ, ఆ ఇద్దరు మాత్రం తమ వాగ్వాదాన్ని పెంచుకుంటూ పోయారు తప్ప తగ్గించలేదు. ఈ క్రమంలో బస్సును మధ్యలో ఆపిన సీనియర్, రోడ్డు పక్కనే ఉన్న స్టాల్లో కత్తిని తీసుకుని జూనియర్‌పై దాడికి పాల్పడ్డాడు. మెడ, భుజంపై పలు గాడ్లు పెట్టాడు. బస్సు డ్రైవర్, హెల్పర్, ఇతర విద్యార్థులు సీనియర్ విద్యార్థిని అడ్డుకుని, జూనియర్‌ను కాపాడారు. వెంటనే గాయపడిన జూనియర్‌ను కోల్‌కతాలోని దమ్ దమ్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన సీనియర్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
డెంటల్ విద్యార్థినిపై జూనియర్ అత్యాచార యత్నం
విజయవాడ: విజయవాడ నగరంలోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థినిపై థర్డీయర్ విద్యార్థి శ్రీధర్ లైంగికదాడికి యత్నించారు. ఈ సంఘటన శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సదరు విద్యార్థిని తన స్నేహితురాలితో కలసి శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో ఉంటోంది. అయితే శ్రీధర్ గత రాత్రి బాగా మద్యం సేవించి విద్యార్థిని ఉంటున్న గదికి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీసిన ఆమెపై పడి... అమాంతంగా అత్యాచారం చేయడోయాడు. అతడి నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకుని బయటపడి... పటమట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. -
ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి
కోల్‌సిటీ: తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో సీనియర్ విద్యార్థినిపై జూనియర్ విద్యార్థి బ్లేడుతో దాడి చేశాడు. కాలేజీ ఆవరణలోనే ఈ దాడి జరగగా యాజమాన్యం గోప్యంగా ఉంచింది. విషయం బహిర్గతం కావడంతో పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు సేకరించి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్ కథనం మేరకు.. మార్కండేయ కాలనీలోని గాంధీ డిగ్రీ ప్రైవేట్ కాలేజీలో కమాన్‌పూర్ మండలానికి చెందిన ఓ విద్యార్థిని(20) బీకాం ఫైనలియర్ చదువుతోంది. ఇదే కాలేజీలో స్థానిక విఠల్‌నగర్‌కు చెందిన కోయల శ్రీకాంత్(19) బీకాం సెకండియర్ చదువుతున్నాడు. కొంతకాలంగా ఇతడు సీనియర్‌ను ప్రేమిస్తున్నానని వెంటబడుతున్నాడు. విద్యార్థినిని నిరాకరించడంతో గతంలో తన చేతిపై బ్లేడ్‌తో కోసుకుని గాయాలు చేసుకున్నాడు. సోమవారం కాలేజీలో విద్యార్థినిని తన ప్రేమ విషయంపై ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరిస్తూ కాలేజీపై అంతస్తులోని తరగతి గదిలో మర్చిపోయిన పుస్తకాలు తీసుకురావడానికి వెళ్లింది. వెనకాలే వెళ్లిన శ్రీకాంత్ ఆమెను అడ్డగించి తన వెంట తీసుకొచ్చిన బ్లేడ్‌తో అరచెయ్యిపై కోసి పారిపోయాడు. రక్తం మరకలతో భయపడుతూ బయటకు పరుగులు తీసిన విద్యార్థినిని గమనించిన కాలేజీ యాజమాన్యం వెంటనే స్థానిక స్వతంత్రచౌక్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. తీవ్రంగా గాయం కావడంతో సుమారు ఏడు కుట్లు పడ్డాయని తెలిసింది. ఈ దాడిపై కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా, అలాంటి సంఘటన జరగలేదని, కాలేజీలో బెంచీ తగలడంతోనే విద్యార్థిని గాయపడిందని నిర్లక్ష్యంగా చెప్పారు. విషయం తెలిసిన వన్‌టౌన్ పోలీసులు బాధిత విద్యార్థినితో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 326 క్లాజ్-ఏ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలిస్తామని వెల్లడించారు. ఈ సంఘటనను పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఇ.పద్మ, డీపీఎస్‌యూ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ ఖండించారు. విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు నిర్భయ చట్టంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. -
జూనియర్ ను కొట్టి చంపిన సీనియర్ విద్యార్థులు
హైదరాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు కొట్టి చంపిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అమ్మాయి విషయంలో తలెత్తిన వివాదమే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, కొట్టిన దెబ్బల తోనే మృతి చెందాడని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొనడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. వివరాలు ఇలా ... సఫిల్‌గూడకు చెందిన ఎన్.మల్లేశ్‌గౌడ్, నిర్మల దంపతుల కుమారుడు యశ్వంత్‌గౌడ్(19) దూలపల్లిలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. నవంబర్ 9 తెల్లవారుజామున ఇంటికి సమీపంలోని స్నేహితుడు వాకింగ్‌కు రమ్మని యశ్వంత్‌కు ఫోన్ చేయగా (ఏపీ28 3837) హీరోహోండా బైక్‌పై వెళ్లాడు. ఉదయం 7.20 నిమిషాలకు సఫిల్‌గూడలో ఉంటున్న మరో విద్యార్థి.. అపస్మారకస్థితిలో ఉన్న యశ్వంత్‌ను వాహనంపై అతడి ఇంటికి తీసుకొచ్చాడు. సఫిల్‌గూడ చెరువుపై లారీ, బైక్‌ను ఢీ కొట్టడంతో గాయపడ్డాడని అతడి తండ్రి మల్లేశ్‌గౌడ్‌కు చెప్పి వాహనాన్ని అప్పగించి వెళ్లిపోయాడు. యశ్వంత్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో చిన్న ప్రమాదమే అనుకున్నారు. కొద్దిసేపటికి కడుపులో నొప్పిగా ఉందని అనడంతో ఏడీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా తగ్గకపోవడంతో మహాలక్ష్మి నర్సింగ్ హోంకు తీసుకెళ్లారు. ఛాతి, కడుపు, ఎక్స్‌రే తీయించారు. కడుపులో బలమైన గాయాలయ్యాయని పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు చెప్పడంతో యశోదకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడు. రోడ్డు ప్రమాదంగా కేసు.. తోటి విద్యార్థులు చెప్పిన వివరాల మేరకు నేరేడ్మెట్ పోలీసులు రోడ్డు ప్రమాదం కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు అందుకు విరుద్ధంగా వచ్చింది. కడుపు, ఛాతి, మూత్రపిండాలు, తల వెనుక భాగం చిన్న మెదడులో రక్తప్రసరణ ఎక్కడికక్కడే నిలిచిపోయిందని వైద్యులు నివేదిక ఇచ్చారు. తొలుత సఫిల్‌గూడ చెరువుపై ప్రమాదం జరిగిందని తెలిపిన విద్యార్థులు తర్వాత ప్యారడైజ్ ఫ్లైఓవర్‌పై ఘటన జరిగిందని పేర్కొనడంతో కేసును మహంకాళి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. మా బిడ్డను చంపారు.. యశ్వంత్‌ను పథకం ప్రకారం కొంతమంది విద్యార్థులు కొట్టి చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు. మత్తు మందు ఇచ్చి బయటికి కనిపించని విధంగా బలమైన దెబ్బలు కొట్టారని, అదే పోస్టుమార్టం నివేదికలో ఉందన్నారు. టీ షర్టుపై కూడా బూటు కాలు ముద్రలున్నాయని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య కేసుగా నమోదు చేసి, నిందితులను శిక్షించాలని మృతుడి తల్లిదండ్రులు నగర సీపీ ఎం.మహేందర్‌రెడ్డిని కోరారు. ప్రేమ వ్యవహారమే కారణమా? ఓ విద్యార్థిని విషయంలో యశ్వంత్‌కు కళాశాలలో చదువుతున్న సీనియర్లతో వివాదం ఉన్నట్టు తెలుస్తోంది. సంఘటనకు ముందురోజు సదరు విద్యార్థినికి వాట్సప్ మెసేజ్ పంపాడు. ఈ విషయమై నవంబరు 8న కళాశాల నుంచి ఇంటికి వచ్చే సమయంలో కృపా కాంప్లెక్స్ వద్ద సీనియర్ విద్యార్థులతో గొడవ జరిగినట్టు తెలి సింది. దాడిలో 10 మంది వరకు పాల్గొన్నారని, వారిని విచారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని మృతుని తండ్రి మల్లేశ్ పోలీసులను కోరారు.