కేపీహెచ్‌బీకాలనీ/ సనత్‌నగర్, న్యూస్‌లైన్ : డాక్టరేట్ పట్టాను అందుకుని చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్న వేళ... కన్న బిడ్డల అభినందనలు అందుకున్నవారు కొందరు... తమ చిరంజీవులు యూనివర్సిటీకే టాపర్లుగా నిలిచిన క్షణాన... గుండెలకు హత్తుకుని కళ్లల్లో ఆనంద భాష్పాలు రాల్చినవారు మరికొందరు... వెరసి స్నాతకోత్సవ వేళ జేఎన్టీయూహెచ్ ఆడిటోరియం శుభాభినందనలతో పులకించిపోయింది. జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవం శనివారం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.
పద్మవిభూషణ్ డాక్టర్ అనిల్ కకోద్కర్ చేతుల మీదుగా 197 మంది రీసెర్చ్ స్కాలర్స్‌కు పీహెచ్‌డీ పట్టాలు, 52 మంది టాపర్స్‌కు బంగారు పతకాలను అందజేశారు. ఇందులో వర్సిటీ టాపర్స్ 11 మంది బంగారు పతకాలు, 23 మంది ఎండోమెంట్ బంగారు పతకాలు, వర్సిటీ అనుబంధకళాశాలల టాపర్స్ 18 మంది గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. వర్సిటీ వీసీ రామేశ్వరరావు, రిజిస్ట్రార్ ఎన్వీ.రమణారావు, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వినయ్‌బాబు, డెరైక్టర్ ఎవాల్యుయేషన్ ఈశ్వర్‌ప్రసాద్, వివిధ విభాగాల డెరైక్టర్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
మరపురాని అనుభూతి
బీటెక్ ఈసీఈ బ్రాంచ్‌లో బంగారు పతకం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దీంతో పాటు జి.పురుషోత్తం, బూరుగుల రామకృష్ణ, పిసుపాటి సుప్రియ దేశయ్ అనే మూడు ఎండోమెంట్ బంగారు పతకాలు అందుకోవడం మరుపురాని అనుభూతి. ఈ విజయం వెనుక తల్లిదండ్రులు, అధ్యాపక బృందం ప్రోత్సాహం ఎంతో ఉంది.
- కె.కావ్య, ఈసీఈ విభాగం టాపర్,
నాలుగు బంగారు పతకాల విజేత.
మరిచిపోలేని సంఘటన
నా ఆనందానికి అవధుల్లేవు. యూనివర్సిటీ క్యాంపస్‌లోనే విద్యాభ్యాసం చేశాను. ప్రస్తుతం బెంగుళూరులో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. బంగారు పతకం అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. భవిష్యత్తులో జర్మనీలో మ్యాథ్స్‌లో ఏదో ఒక అంశంపై పీహెచ్‌డీ పూర్తిచేయాలన్నదే నా లక్ష్యం.
- జ్యోతిర్మయి, ఎమ్మెస్సీ టాపర్
ఫార్మా రంగంలో పరిశోధనలు చేస్తా
యూనివర్సిటీ టాపర్‌గా బంగారు పతకంతో పాటు షాదన్ అండ్ ఉమెన్, డాక్టర్ ఆంధ్రానాయుడు ఎండోమెంట్ బంగారు పతకాలు అందుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. ప్రస్తుతం బాలానగర్‌లోని నైపర్ ఇనిస్టిట్యూట్‌లో ఎంఎస్ ఫార్మా ఎనాలిసిస్ చేస్తున్నాను. భవిష్యత్తులో ఫార్మా రంగంలో పరిశోధనలు చేస్తా.
- పి.కావ్య, బి.ఫార్మసి టాపర్, మూడు బంగారు పతకాల విజేత
కొత్త ఆవిష్కరణలకు కృషి
యూనివర్సిటీ టాపర్‌గా గోల్డ్‌మెడల్‌తో పాటు వెల్లంకి రామారావు, ఎంసీ కన్సల్టింగ్ అనే మరో రెండు ఎండోమెంట్ బంగారు పతకాలు అందుకోవడం మరపురాని అనుభూతి. సివిల్ రంగంలో నూతన ఆవిష్కరణల దిశగా పరిశోధనలు చేసేందుకు కృషి చేస్తా.
- మందీప్‌సింగ్, సివిల్ టాపర్, మూడు బంగారు పతకాల విజేత
పరిశోధన రంగంలో ఫలితాలు సాధిస్తా
సీఎస్‌ఈ విభాగంలో యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచాను. నేను కీసరలోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసించా. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచినందుకు గాను బంగారు పతకంతో పాటు డాక్టర్ ఎండీ.విజరత్ రసూల్‌ఖాన్ ఎండోమెంట్ బంగారు పతకం రావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో పరిశోధనల రంగం వైపు వెళ్ళాలనుకుంటున్నా.
- నవీన, సీఎస్‌ఈ టాపర్
ఫైబర్ ఆప్టిక్‌పై పరిశోధనలు చేస్తా
అరుదైన పైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ అండ్ నెట్‌వర్క్ పీహెచ్‌డీ సాధించినందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని సైంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్నాను. మొబైల్ కమ్యూనికేషన్‌లో ఫైబర్ ఆప్టిక్ సబ్జెక్టుపై మరిన్ని పరిశోధనలు చేస్తాను.
- డాక్టర్ కేవీఎస్‌ఎస్‌ఎస్‌ఎస్ సాయిరాం, పీహెచ్‌డీ పట్టభద్రులు
డాక్టరేట్ గౌరవప్రదమైంది
తల్లిదండ్రులు పెట్టిన పేరుకు ముందు పరిశోధనాపరంగా ఇచ్చే డిగ్రీ అయిన డాక్టర్ అనే పదం ఎంతో గౌరవమైనది. ఏపీ జెన్‌కో విభాగంలో ఎలక్ట్రానిక్స్‌లో నేను చేసిన అంశంపై మొట్టమొదటగా పీహెచ్‌డీ అందుకున్నాను.
- డాక్టర్ కె.వి.ఎన్.ఎమ్. ప్రసాద్
శ్రీమతి సమక్షంలో అవార్డు
నా శ్రీమతి ఆచార్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న విశ్వ విద్యాలయం నుంచి నా కుటుంబ సభ్యుల సమక్షంలో అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది.
- డాక్టర్ బి. అనంతరెడ్డి, సుఖిల పవర్ ఎలక్ట్రానిక్స్ అధినేత
తీరిన స్వప్నం
పీహెచ్‌డీ పట్టా అందుకోవడమనేది నా చిన్నప్పటి కల. అది నేటికి నెరవేరింది. ఇమేజ్ ప్రాసెసింగ్ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు.
- డాక్టర్ జి. వెంకటరామిరెడ్డి, జేఎన్టీయూహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్
పేరెంట్స్ కోరిక నెరవేరింది
చదువు ప్రాముఖ్యతను చిన్ననాటి నుంచి నా తల్లిదండ్రులు చెబుతుండేవారు. డాక్టర్‌ను చేయాలని వారి కోరిక. పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల డాక్టర్‌ను కాలేకపోయాను. నేడు డాక్టర్ ఇందిరారాణి అని నాపేరు చూసిన నా తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు.
- డాక్టర్ ఇందిరారాణి, జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్
ఆర్‌అండ్‌బీ మహిళా ఇంజనీర్లలో తొలి డాక్టరేట్
‘హైవేల నిర్మాణంలో పర్యావరణ ప్రమాణాలు’ అనే అంశంపై చేసిన పరిశోధనకు రోడ్లు భవనాల శాఖలో ఈఈగా పనిచేస్తున్న చిల్క వసంతకు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం డాక్టరేట్ అవార్డును ప్రదానం చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో జన్మించిన వసంత ఆర్‌అండ్‌బీలో పనిచేసే మహిళా ఇంజినీర్లలో డాక్టరేట్ అందుకున్న తొలి మహిళ కావడం గమనార్హం. ప్రస్తుతం ఈమె భువనగిరిలో ఈఈగా పనిచేస్తున్నారు.
జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవ సందడి
Published Sun, Nov 10 2013 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
Advertisement
Advertisement