
ప్లీనరీపై ఉన్న శ్రద్ధ కరువుపై చూపరా? : కె.లక్ష్మణ్
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో కరువు విలయతాండ వం చేస్తుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో సీఎం, జిల్లా స్థాయిలో మంత్రులు కరువుపై సమీక్షలు నిర్వహించకపోవడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ మీద, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో సీఎం కేసీఆర్ చూపుతున్న శ్రద్ధను కరువుపై కూడా చూపాలన్నారు. నెలాఖరులోగా కరువుపై సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోకపోతే వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.
ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు చింతా సాంబమూర్తి, ప్రదీప్ కుమార్, లాయక్ అలీతో కలసి బుధవారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు కరువు పరిస్థితిపై వినతి పత్రం అందజేశారు. తమ పార్టీ తరఫున 10 బృందాలు జిల్లాల్లో పర్యటించి కరువు పరిస్థితులపై అధ్యయనం చేశాయని, ఆ వివరాలను సీఎస్ రాజీవ్ శర్మకు అందజేశామని తెలిపారు. కరువుపై చర్చించడానికి గత మూడు వారాలుగా సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదన్నారు.