
మోదీ సునామీ పొంచి ఉంది: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాని మోదీ ప్రభావం సునామీని సృష్టించబోతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. పార్టీ నిర్మాణాన్ని పోలింగ్ బూత్‌స్థాయి వరకు పటిష్టం చేయడం ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రాజకీయ పోరాటానికి బీజేపీ సమాయత్తమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘పల్లె పల్లెకు బీజేపీ– ఇంటింటికీ మోదీ పథకాలు’ కార్యక్రమాన్ని సోమవారం ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గంలోని బండమైసమ్మ బస్తీలో ఆయన ప్రారంభించారు.
పోలింగ్‌బూత్ స్థాయిల్లో పార్టీ పటిష్టత, కేంద్ర పథకాల ప్రచారం, మూడేళ్ల మోదీ పాలన, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జూన్ 12 వరకు సాగనుంది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ సర్వేల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
టీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కొరవడిందని, తెలంగాణలో వీటి సాధన బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన తీరును గురించి, సీఎం కేసీఆర్ వైఫల్యాలను గురించి ఇంటింటికీ కరపత్రాల రూపంలో తెలియజేస్తామని చెప్పారు.