సింగపూర్‌కు దాసోహమంటోంది ఎందుకు?
చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్‌సీపీ నేత కన్నబాబు ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు ఎందుకు దాసోహమంటోందని, అసలు సింగపూర్ అంటే అంత మోజెందుకని వైఎస్సార్ కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రశ్నించారు. ఏపీ ప్రజల రాజధానిని స్వదేశీ సంస్థలు, నిపుణులతో కాకుండా సింగపూర్‌తో నిర్మించడమంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే 170 జీవోతోపాటుగా అన్ని ఒప్పందాల్ని సమీక్షించి తీరతామన్నారు.
ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సింగపూర్ కన్సార్టియంకు రాజధానిని ధారాదత్తం చేయడం చారిత్రక తప్పిదమన్నారు. తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టవద్దని ఎన్టీఆర్ ఆరాటపడితే బాబు మాత్రం సింగపూర్‌కు తాకట్టు పెట్టడం దారుణమన్నారు.