సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన కరువు పరిస్థితులను పట్టించుకోకుండా రాజకీయాల్లోనే తలమునకలవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, అభినవ నీరోలా వ్యవహరిస్తున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌తో కలసి శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, రోమ్ నగరం తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించుకున్నట్టుగా కరువు, వలసలు, తాగునీటి కొరత, వడదెబ్బతో మరణాలు తీవ్రస్థాయిలో ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవేమీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఖమ్మంలో పార్టీ ప్లీనరీ పెట్టాలని, అందుకోసం ఎన్నికల సంఘం అనుమతించాలని, అక్కడే నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ప్రకటన చేస్తామని సీఎంకేసీఆర్ ఆలోచనలు చేయడం అత్యంత దారుణమని భట్టి విమర్శించారు.