హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కరువు కాటేస్తుంటే ప్లీనరీ పెట్టుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్కు ఏమి వచ్చింది? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులని హామీలిచ్చారని మండిపడ్డారు.
ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా డిమాండ్ చేశారు. పాలమూరులో ఆర్డీఎస్ పనులను ప్రారంభించాలన్న డిమాండ్తో మే 9న కాంగ్రెస్ ధర్నా చేపట్టనున్నట్టు వెల్లడించారు. అన్ని జిల్లాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం సమగ్ర జల విధానాన్ని ప్రకటించాలని చెప్పారు. ఎఫ్ఆర్బీం పరిమితిని పెంచినా, రంగారెడ్డి జిల్లాలో భూములను విక్రయించినా ఇంకా కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలను మాఫీ చేయడం లేదంటూ దుయ్యబట్టారు.
ఖమ్మంలో ఓటమి పాలైన టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు పాలేరులో చెల్లుతారా? అంటూ ఎద్దేవా చేశారు. పాలేరు కాంగ్రెస్ కోసం విరాళంగా సీఎల్పీ ఒక నెల వేతనాన్ని ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాలేరు ఉప ఎన్నిక వ్యయం కోసం పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కొనసాగుతోందని ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.