కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెబుతారు
విలీన దినోత్సవంపై ఆయన మాట మార్చారు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమంలో డిమాండ్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండీ ఎందుకు నిర్వహించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. భారత్‌లో హైదరాబాద్ స్టేట్ విలీన దినోత్సవం సందర్భంగా శనివారం గాంధీభవన్‌లో, కోఠిలో అశోక స్థూపం వద్ద ఉత్తమ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా రెండు చోట్లా మాట్లాడారు. తొలి ప్రధానమంత్రి నెహ్రూ, కేంద్ర హోంమంత్రి వల్లభాయ్‌పటేల్‌ల కృషితోనే హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమైందని పేర్కొన్నారు. అప్పడు హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉండి, ఇప్పుడు తమ పరిధిలో ఉన్న జిల్లాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు.
తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసినట్లుగానే నియంతృత్వంతో పాలిస్తున్న కేసీఆర్‌కు కూడా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, అధికార ప్రతినిధి మధుయాష్కీ, రాపోలు ఆనంద్ భాస్కర్, నేతలు దానం నాగేందర్, అంజన్‌కుమార్ యాదవ్, అనిల్‌కుమార్ యాదవ్, కనుకుల జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.