కేసీఆర్... నయా రజ్వీ: ఉత్తమ్
గాంధీభవన్‌లో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: రజాకార్ల ఆగడాలను ఎదిరించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ నయా ఖాసీం రజ్వీలాగా రజాకార్ల పాలనను సాగిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సెప్టెంబరు 17 విలీన దినోత్సవాన్ని గాంధీభవన్‌లో ఆదివారం నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పాలనను గుర్తుకు తెచ్చేలా పేదలు, గిరిజనులు, దళితులపై దాడులు జరుగుతున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేశారని, నేరెళ్లలో దళితులపై పోలీసులు దాడి చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించిన ఘటనలను మరిచిపోకముందే భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో గుత్తికోయలపై పోలీసులు, అటవీ సిబ్బంది దాడులు చేయడం అమానుషమని అన్నారు.
గిరిజన రైతుల ఇళ్లను కూల్చివేసి, మహిళా రైతులను వారి చీరలతోనే చెట్లకు కట్టేసి భయానక వాతావరణం సృష్టించారన్నారు. ఇలాంటి దుర్మార్గమైన పాలకులకు తరిమికొట్టడానికి మరో పోరాటానికి సిద్ధపడాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాకముందు తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కోరిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నిర్వహించడంలేదో చెప్పాలన్నారు.