బీజేపీపై కేసీఆర్ విషప్రచారం..
కేంద్ర మంత్రి దత్తాత్రేయ
గత ప్రభుత్వాలు చేసిన పనుల్ని తామే చేశామని చెప్పుకోవడం టీఆర్‌ఎస్‌కే చెల్లింది
సైదాబాద్: బీజేపీపై కక్షగట్టి సీఎం కేసీఆర్ విషప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆరోపించారు. స్మార్ట్‌సిటీల ఎంపికలో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపలేదన్నారు. సీఎం కే సీఆర్‌నే హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ పేరును సూచిస్తూ కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు అబద్ధాలు చెబుతూ బీజేపీపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ సైదాబాద్ డివిజన్ అభ్యర్థి సంరెడ్డి శైలజా సుందర్‌రెడ్డి తరఫున శనివారం ఆయన రోడ్‌షోలో పాల్గొన్నారు. రెడ్డి బస్తీ, పూసల బస్తీ, మాదిగ బస్తీ, ఏకలవ్యనగర్, సైదాబాద్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ విషప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి, నగరాభివృద్ధిపై సీఎంకు చిత్తశుద్ధి లేదని, కే వలం తన నియోజకవర్గాన్నే అభివృద్ధి చేయాలనే ఆలోచన మాత్రమే ఉందని విమర్శించారు. 18 నెలల పాలనా కాలంలో ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు పూర్తి చేసిన పనులు తామే చేశామని చెప్పుకోవడం టీఆర్‌ఎస్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. భాగ్యనగరిలో సిటీ కంట్రోల్ రూం నిర్మించకముందే, దానిని పూర్తి చేసినట్టు హోర్డింగ్‌లు పెట్టి ప్రచారం చేసుకోవడమేంటని నిలదీశారు.
‘మెట్రో ఎవరు ప్రారంభించారు? ఎవరు నిధులు కేటాయించారు?’ అనేది టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాలన కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటేయాలని కోరారు. రెడ్డి బస్తీలో గాంధీ వర్ధంతి సభలో పాల్గొని మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ముద్దం శ్రీకాంత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్‌జీ, కాసం వెంకటేశ్వర్లు, సుదర్శన్‌రెడ్డి, బండారి నవీన్‌కుమార్, శ్రీను, అరవింద్‌కుమార్, కోళ్ల గోపి, కడారి రాముయాదవ్ పాల్గొన్నారు.