కోటి ఆశలతో, వేల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో ధర్నాలు ఆగిపోయినయా, ముళ్ల కంచెల బాధ తప్పిందా అని బీజేపీ శాసనసభాపక్షనేత జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ రాష్ట్రకార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కొత్త రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలు, కుటుంబపాలనతో ప్రతిపక్షపార్టీలే ఉండకూడదనే దుర్మార్గ రాజకీయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్‌లో చేరితేనే అభివృద్ధి పనులు, లేకుంటే వేధింపులు అనే విధంగా ఇతరపార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను, స్థానిక సంస్థల ప్రతినిధులను బెదిరిస్తున్నారని విమర్శించారు. సమస్యలపై ఇందిరాపార్కు వద్ద ధర్నాలు ఆగిపోయినయా అని ప్రశ్నించారు. సమైక్యరాష్ట్రంలో ఉన్న ముళ్ల కంచెల బాధ స్వంత రాష్ట్రంలో తెలంగాణవాదులకు తప్పిందా అని ప్రశ్నించారు. కుటుంబపాలన, అవినీతి, కార్పొరేట్ కాలేజీల దోపిడీ, పార్టీ ఫిరాయింపులు, ప్రతిపక్షపార్టీలపై వేధింపులు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పెరిగిపోవడం నిజం కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
కుటుంబపాలన, పార్టీ ఫిరాయింపులతో రాష్ట్రంలో రాజకీయ అంధకారం, టీఆర్‌ఎస్ నేతల్లో అహంకారం పెరిగిపోయినాయని విమర్శించారు. పార్టీలో చేరితేనే నిధులు ఇస్తామని సర్పంచులను బెదిరిస్తున్న టీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీకి పోయి నిధులు ఎలా అడుగుతారని అన్నారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల పట్ల టీఆర్‌ఎస్ ఎలా వ్యవహరిస్తున్నదో కేంద్ర మంత్రులకు, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఒక నీతి, రాష్ట్రప్రభుత్వానికి మరొక నీతి ఉంటుందా అని ప్రశ్నించారు.
హింసా కార్యకలాపాలకు దిగుతున్నారనే సమాచారంతో అరెస్టన ఉగ్రవాదులకు న్యాయం సహాయం అందిస్తామని బహిరంగంగా ప్రకటించిన ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంఐఎంకు భయపడి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అప్రమత్తత వల్ల హైదరాబాద్‌కు చాలా పెద్దప్రమాదం తప్పిందన్నారు. అసదుద్దీన్‌పై చర్యలకోసం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ను కలిసి ఫిర్యాదుచేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో టీడీపీపీ కార్యాలయాన్ని నోటీసుల్లేకుండా తొలగించడం అన్యాయమని, నిబంధనల మేరకు యంత్రాంగం వ్యవహరించాలని సూచించారు.