ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్ : కోటి ఆశలతో ఉన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నారాయణగూడ కేశవమెమోరియల్ ఆడిటోరియంలో జరిగిన ‘తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం’(తపస్) రాష్ట్ర విద్యా సదస్సులో ప్రసంగించారు. 1947లో భారత దేశం మొత్తం స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటుంటే తెలంగాణ మాత్రం నిజాం పాలనలో అనేక కష్టాలు పడిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నెహ్రూను కూడా కాదని సర్దార్ వల్లభాయ్‌పటేల్ సైనిక చర్యతో తెలంగాణకు విమోచనం లభించిందన్నారు.
వైయస్ నుంచి కిరణ్‌దాకా తాము చేస్తున్న డిమాండ్ మేరకు సెప్టెంబర్-17న గోల్కొండ కోటపై జెండా ఎగురేద్దామంటే కేసీఆర్ అరెస్టు చేయించారని విమర్శించారు. కేసీఆర్ పాలనను బేరీజు వేసేందుకు ఈ ఒక్క సంఘటన చాలన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన ప్రభుత్వంపై జనం కోటి ఆశలు పెట్టుకున్నారని, అయితే అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఎవరో ఏదో అంటారని మీరు భయపడాల్సిన అవసరం లేదనీ ఇప్పుడు వారి కంటే మనమే బలమైన శక్తిగా ఉన్నామంటూ పరోక్షంగా టీఆర్‌ఎస్‌నుద్దేశించి ఉపాధ్యాయ సంఘానికి కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
ఏకీకృత రూల్స్‌పై మంత్రితో మాట్లాడతా..
భారతీయ జీవన విలువలు కాపాడేందుకు ‘తపస్’ ఉద్భవించడం సంతోషంగా ఉందని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఉపాధ్యాయులు కోరుకుంటున్న ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.