ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్: ప్రాథమిక విద్యను పునరుద్ధరించి, అందులో అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ (టీఎస్ ఎస్‌జీటీ) సంఘం ఆధ్వర్యంలో ‘తెలంగాణలో ప్రాథమిక విద్య పరిరక్షణకు మేధావుల సమాలోచనలు’ అనే అంశంపై సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ప్రాథమిక విద్యను పటిష్టం చేసిన తర్వాతే ఎస్‌జీటీల సమస్యలను పరిష్కరించాలని, వారి సర్వీసులను అమలు చేయాలని అన్నారు. ఎమ్మెల్సీల ఎన్నికల్లో ఎస్‌జీటీలకు ఓటు హక్కును కల్పించాలని కోరారు. మూడేళ్ల పిల్లలకు ఎల్ కేజీ, యూకేజీ విద్యాబోధన జరగాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యేక దృష్టి సారించి, కార్పొరేట్ సంస్థల నుంచి నిధులను సమకూర్చాలని సూచించారు.
ఎమ్మెల్సీ పి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించటంతో పాటు ప్రతి స్కూల్‌కు ఒక అటెండర్‌ను నియమించేలా కృషి చేస్తానని చెప్పారు. విద్యావంతుల వేదిక అధ్యక్షుడు గురిజాల రవీందర్ రావు, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఎస్.మధుసూదన్‌రావు, ప్రధాన కార్యదర్శి కె.పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.