
సీపీఐ నేతలతో కోదండరామ్ భేటీ
ఉద్యోగాల భర్తీ, ప్రాజెక్టుల్లో అవినీతిపై పోరాడాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నీటిపారుదల ప్రాజెక్టులు తదితర సమస్యలపై సమన్వయంతో పనిచేయాలని టీజేఏసీ, సీపీఐ నిర్ణయించాయి. ముఖ్యమైన సమస్యలపై జేఏసీ, సీపీఐ విడివిడిగా తమ తమ పద్ధతుల్లో కార్యక్ర మాలు నిర్వహించాలని నిర్ణయించారు. ›ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తమ ఉద్యమాన్ని ఆపబోయేది లేదని టీజేఏసీ స్పష్టం చేసినట్లు సమాచారం. అందుకు సీపీఐ కూడా పూర్తి మద్దతు ప్రకటించింది.
నీటి పారుదల ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలపై కూడా పోరాడాలని నిర్ణయించుకున్నారు. శనివారం జేఏసీ నేతలతో మగ్దూంభవన్‌కు వచ్చిన కోదండరాం.. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డి, బాలమల్లేష్‌లతో సమావేశమయ్యారు. తమ ఆందోళనకు సీపీఐ మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ, వ్యూహాలపై చర్చించారు.