టి. కాంగ్రెస్పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నాయకుడు, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం హైదరాబాద్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని బాగు చేయాలంటే తక్షణమే సర్జరీ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. టి. కాంగ్రెస్ను ప్రక్షాళన చేయకపోతే పార్టీని పోస్ట్మార్టం చేసే పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను మించిన అసమర్థుడు ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అని ఆయన ఆరోపించారు.
పార్టీ వరుస ఓటములకు బాధ్యత వహించి... పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందని ఉత్తమ్కు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచించారు. పార్టీ నాయకులు సీరియస్గా తీసుకోకపోవడం వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైందన్నారు. నేనే పీసీసీ చీఫ్ అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేవాణ్ణి... లేదంటే రాజీనామా చేసేవాణ్ణి అని చెప్పారు. పొన్నాల, ఉత్తమ్కుమార్ రెడ్డి నాయకత్వంలోనే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత పార్టీ పరిస్థితిపై తక్షణమే పార్టీ అధ్యక్షురాలు సోనియాకు లేఖ రాస్తానని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పాలని ఆయన అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలోని 15, 20 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు తామే సీఎం అభ్యర్థి అని అనుకుంటున్నారని వెల్లడించారు. గాంధీభవన్లో ప్రెస్మీట్లతో కాంగ్రెస్ పార్టీ ఒలపడదని... ఓట్లు కూడా రావని ఆయన పేర్కొన్నారు. భువనగిరి లోక్సభ ఎన్నికల్లో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓటమికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ గ్రూప్ రాజకీయాలే కారణమని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన నేతలకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ సందర్భంగా అధిష్టానానికి సూచించారు.