కేటీఆర్‌కు ‘గ్రేటర్’ కానుక
అదనపు బాధ్యతగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అప్పగింత
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల బాధ్యతలను భుజానికెత్తుకొని టీఆర్‌ఎస్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు ‘గ్రేటర్’ కానుక లభించింది! గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్‌కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను అప్పగిస్తానని ఎన్నికల ప్రచార సభలో చేసిన ప్రకటనను సీఎం కేసీఆర్ ఆదివారం నెరవేర్చారు. కేటీఆర్‌కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను అదనపు బాధ్యతగా అప్పగించారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్, ఐటీ శాఖలు యథాతథంగా కేటీఆర్ వద్దే ఉంటాయి. పురపాలక శాఖ ఇప్పటివరకు సీఎం వద్ద ఉంది. దీంతో చిన్న అంశంపై అనుమతి కావాలన్నా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాల్సి రావడంతో అధికారులు ఇబ్బంది పడేవారు.
ఫలితంగా సీఎం సంతకానికి నోచుకోక పురపాలక శాఖకు సంబంధించిన వందల ఫైళ్లు సీఎంవోలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉంటున్నాయి. మంత్రి కేటీఆర్ ఈ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఫైళ్లకు మోక్షం లభిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.