రాజకీయాల్లోకి రావాలంటే తగినంత పరిజ్ఞానం ఉండాలి.. అంతకుమించి ధైర్యం ఉండాలి.. వెనుక అండదండలు ఉండాలని లెక్కలు వేస్తుంటారు. కానీ, ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక ముందు ఒక లెక్క అంటోంది నగర యువ నారి. ఈ ఏడాది మహిళలు ముఖ్యంగా యువతులు తమ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. చదువుకున్న యువతులు డిగ్రీ పట్టా చేతబట్టుకొని మరీ రంగంలోకి దిగారు. సమస్యలు ఎందుకు పరిష్కారం కావో తేల్చుకుంటాం అంటున్నారు. చూసేవారికి వీరు వేసే అడుగు చిన్నదిగానే అనిపించవచ్చు. ‘మేం ఈ రోజు వేసే మొదటి అడుగు తర్వాత రాబోయే వారిలో స్ఫూర్తిని నింపాలి. చిన్నవయసులో రాజకీయాల్లోకి వస్తేనే సమాజ సేవలో మరింత చురుకుగా పాల్గొనగలం. మమ్మల్ని చూసి అమ్మాయిలు ఇంకా ఈ రంగంలోకి రావడం పెరగాలి. అప్పుడే సమాజానికి మేలు జరుగుతుంది’ అంటున్న యువతుల స్వరం ఇది.
జాబ్ వదులుకున్నా
ఇన్నాళ్లూ జనం ఎలా ఉన్నారో ఇప్పుడు కాలనీల్లో తిరుగుతుంటే అర్థమవుతోంది. ప్రచారంలో భాగంగా ఎక్కడకు వెళ్లినా కనీస సౌకర్యాలు లేక ప్రజలు అల్లాడటం చూస్తున్నాను. సమాజసేవ చేయడానికి ఇప్పటికే లేట్ చేశాను అనిపించింది. నిన్ననే నేను కలగన్న పెద్ద కంపెనీలో 40 వేల రూపాయల జీతంతో జాబ్‌లో జాయిన్ అవ్వమని ఆఫర్ లెటర్ వచ్చింది. కానీ, వదిలేసుకున్నాను. అందుకు ఇంట్లో అమ్మనాన్నలు ఏమీ అనలేదు. వాళ్లు నా ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చారు. నాన్న రాజకీయాల్లో ఉన్నారు. నాకూ అలా ఆసక్తి పెరిగింది. గెలుస్తాననే నమ్మకం ఉంది. ఫలితం ఏదైనా పూర్తి సమయం సమాజ సేవకే కేటాయిస్తాను.
– టి.వి.తపస్విని యాదవ్ (21), మీర్జాల్‌గూడ, మల్కాజిగిరి
డిగ్రీ చేసి ఇటొచ్చా
పొలిటీషియన్ అవ్వాలనే ఆలోచన నాకు జూనియర్ కాలేజీ నుంచి ఉండేది. బిబిఏ చేశాను. రాజకీయాలంటే ఆసక్తితోపాటు యూత్ ఈ రంగంలోకి వస్తే మోడర్న్ ఐడియాలజీతో ఈ కాలానికి తగ్గట్టు పనులు చేయగలరు. మా నాన్నగారికి జీడిమెట్లలో వ్యవసాయ మోటార్లకు అవసరమైన ఎలక్ట్రికల్ బాక్సులు తయారుచేసే యూనిట్ ఉంది. ఎవరిపైనా ఆధారపడాల్సిన పని లేదు. మా ఇంట్లో ఎవరూ రాజకీయాల్లో లేరు. నా ఇంట్రస్ట్ పాలిటిక్స్ అని చెప్పినప్పుడు నాన్న ఎంకరేజ్ చేశారు. ప్రచారానికి నా స్నేహితులతో కలిసి వెళుతున్నాను. ‘ఇంత చిన్న వయసులో మాకేం సాయం చేస్తావు?’ అనే మాటలు కూడా అక్కడక్కడా వింటున్నాను. ఏం చేయగలనో వివరంగా చెబుతున్నాను.
– పెరుమాళ్ల వైష్ణవి (21), సుభాష్‌నగర్, సనత్‌నగర్
రెండిట్లోనూ ఉంటాను
డాక్టర్ని అయ్యి పేదవాళ్లకు ఉచితంగా చికిత్స చేయాలన్నది చిన్నప్పటి నుంచీ నా కల. ఆ లక్ష్యంతోనే ఎంబీబిఎస్ చేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ ఇయర్‌లో ఉన్నాను. మా నాన్న ఏసీ టెక్నిషియన్‌గా పనిచేస్తారు. మాకు చిన్న షాప్ ఉంది. మా అన్న మహమ్మద్ ఫాజిల్ చాలా చిన్న వయసులోనే పాలిటిక్స్‌లోకి వచ్చారు. తన లక్ష్యం చూస్తూ పెరిగాను. మా ఏరియాలో పేదల పరిస్థితులను స్వయంగా చూస్తూ ఉన్నాను. గెలిస్తే పేదలకు ఉపయోగపడే పనులు చేయవచ్చు. రాజకీయాల్లో ఉంటే సర్వీస్ ఇంకా బాగా చేయవచ్చు అనిపించింది. ఎంబీబిఎస్ పూర్తి చేసి డాక్టర్‌గా రాణిస్తాను. అలాగే, రాజకీయ నాయకురాలిగానూ పేదలకు అండగా ఉంటాను.
– అమీనా సమ్రీన్ (21), నల్లకుంట
వివక్ష తొలగిస్తాను!
నేను ఎంబీయే చేశాను. బాస్కెట్‌బాల్‌లో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదగాలనుకున్నాను. కానీ, స్పోర్ట్స్ అకాడమీలో చాలా సమస్యలు ఫేస్ చేశాను. అబ్బాయిలకైతే ఇద్దరేసి కోచ్‌లుంటారు. అమ్మాయిలకు ఒక కోచ్ దొరకడం కూడా గగనం. ఎవరికైనా చెప్పినా సరిగ్గా పట్టించుకోరు. చాలా విసుగ్గా అనిపించింది. మా నాన్న ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. ఎన్నికల్లో నిలబడతానని నాన్నతో చెప్పినప్పుడు వెంటనే ‘ఓకే’ చెప్పారు. అంతేకాదు, మా ప్రాంతం మొన్నటి వరదలకి బాగా దెబ్బతింది. సామాన్యురాలిగా కంటే కార్పోరేటర్ స్థాయిలో మెరుగైన సేవలు అందించవచ్చు. క్రీడావిభాగంలో అమ్మాయిలకు ప్రోత్సాహం అందించాలి, మా ప్రాంతంలో కనీస అవసరాలు ప్రజలకు అందేలా చూడాలి. ఈ లక్ష్యంతో ఎలక్షన్‌లో పోటీ చేస్తున్నాను.
– ఎ.మౌనిక (26), రామ్‌గోపాల్‌పేట్, సికింద్రాబాద్
మంచి చేసే అవకాశం
డిగ్రీ వరకు చదువుకున్నాను. ఈ మధ్యే నాకు పెళ్లయ్యింది. మా వారు కారు డ్రైవర్‌గా పని చేస్తారు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. మాది లో క్లాస్ ఫ్యామిలీ. కరోనా వల్ల ఫుడ్‌కు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పథకాల కోసం అప్లయ్ చేయడానికి ఆఫీసులకు వెళితే అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉండటం లేదు. లీడర్ ఉన్నారు కదా అని కార్పోరేటర్ దగ్గరకు ఎన్నిసార్లు తిరిగినా పనులు కాలేదు. పైగా, ఫలానా పథకం నుంచి లబ్ధి పొందాలంటే లంచం అడిగారు. చదువుకున్న నాలాంటివారి పరిస్థితే ఇలా ఉంటే.. చదువురాని వారి పరిస్థితి ఏంటి అనుకున్నాను. నలుగురికి మంచి చేసే అవకాశం వస్తే బాగుండు అనుకున్నాను. అప్పుడే ఈ ఎలక్షన్లో పోటీ చేయాలనే ఆలోచన వచ్చింది. ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్నాను.
– మౌనిక రాజేష్ (25), ఇందిరానగర్, ఉప్పల్
Comments
Please login to add a commentAdd a comment