
ప్లాన్ 100 డేస్‌పై కేటీఆర్ మార్క్
గత ప్రణాళికకు పలు సవరణలు
రూ. 163 కోట్లతో జలమండలి కార్యాచరణ
సిటీబ్యూరో: వంద రోజుల కార్యాచరణ ప్రణాళికపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తనదైన ముద్రవేశారు. ఇటీవల జలమండలి రూ. 78.25 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రణాళికలో పలు మార్పులు, చేర్పులను మంత్రి సూచించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రూ. 163 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సవరించిన కార్యచరణ ప్రణాళికను మంత్రికి సమర్పించారు. దీంతో గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ప్రతిపాదనలను మంత్రి ఆమోదించారు. సాధారణంగా వేసవిలో చేపట్టే నిర్వహణ, మరమ్మతు పనుల స్థానే బల్దియా ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం, ఐటీ కారిడార్ సహా శివారు ప్రాంతాల దాహార్తిని తీర్చడం, హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు వంటి జలాశయాల పరిరక్షణకు తాజా కార్యాచరణలో చోటు కల్పించడం విశేషం. సవరించిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.
రూ.40 కోట్ల అంచనా వ్యయంతో శాస్త్రీపురం, గోల్డెన్ హైట్స్, బుద్వేల్, సులేమాన్ నగర్ (రాజేంద్రనగర్ సర్కిల్), బార్కాస్, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో 30 వేల నూతన నల్లా కనెక్షన్ల ఏర్పాటు. హుస్సేన్‌సాగర్ కాలుష్య కాసారం కాకుండా చూసేందుకు రూ. 58 కోట్ల వ్యయంతో ట్రంక్ సీవర్ మెయిన్ పైప్‌లైన్ ఏర్పాటు. రూ. 35 కోట్లతో దుర్గం చెరువుకు కాలుష్య విముక్తి కల్పించేందుకు ట్రంక్ సీవర్ మెయిన్ ఏర్పాటు. రూ. 25 కోట్ల అంచనా వ్యయంతో మాదాపూర్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో నీటిసరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసి ఐటీ జోన్ దాహార్తి తీర్చడం. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో హఫీజ్‌పేట్, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో నీటిసరఫరా పైపులైన్ వ్యవస్థ ఏర్పాటు. చాంద్రాయణగుట్ట డివిజన్ పరిధిలోని బండ్లగూడలో మూడువేల నూతన నల్లా కనెక్షన్ల ఏర్పాటు.
రూ.15 లక్షల అంచనా వ్యయంతో హైదర్‌గూడ ప్రాంతంలో బూస్టర్ పంపు ఏర్పాటు చేసి నీటి సరఫరాను మెరుగుపరచడం. లో ప్రెజర్ సమస్యను పరిష్కరించడం. మల్కాజ్‌గిరి ప్రాంతంలో పలు కాలనీలకు నీటి పంపిణీ పైపులైన్లు ఏర్పాటు. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగ్ ప్రాంతాలకు నీటి సరఫరాకు 400 ఎంఎం వ్యాసార్థం గల పైపులైన్ ఏర్పాటు. నల్లా కనెక్షన్లు మంజూరు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలో నూతన ఫిల్లింగ్ కేంద్రాల ఏర్పాటు. ఇక్కడి నుంచి అదనపు ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా వ్యవస్థ అందుబాటులో లేని ప్రాంతాలకు రోజువారీగా నీటి సరఫరా. నల్లా కనెక్షన్ల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు మోక్షం కల్పించడం. సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో తక్షణం నూతన నల్లా కనెక్షన్ల మంజూరు.
హెచ్‌ఎండీఏ ప్రణాళిక ఇదీ..
సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కార్యాచరణ ప్రణాళికను మంత్రి ఆమోదించారు. ఈమేరకు హెచ్‌ఎండీఏ కమిషనర్ టి. చిరంజీవులు ‘100 డేస్ యాక్షన్ ప్లాన్’ను మీడియాకు వెల్లడించారు. కొత్త భవన నిర్మాణాలు, లేఅవుట్ పర్మిషన్లు, భూ వినియోగ మార్పిడికి సంబంధించి నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌ఓసీ) వంటివాటిని డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం (డీపీఎంఎస్) ద్వారా ఆన్‌లైన్‌లోనే హెచ్‌ఎండీఏ అందించనుంది. 2007-08లో ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరణ కోసం వచ్చి పెండింగ్‌లో ఉన్న 14,500 దరఖాస్తులను వచ్చే మూడు నెలల్లో పరిష్కరించనున్నారు. ఘట్‌కేసర్-కీసర-శామీర్‌పేట మధ్య నిర్మాణం పూర్తి చేసుకున్నట ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనాల రాకపోకలకు అనుమతి.
ఔటర్‌పై ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు పనిచేసేలా చర్యలు. ఔటర్ రింగ్‌రోడ్డులో మెయిన్ కాజ్‌వేకు- సర్వీసు రోడ్ మధ్యలో రైల్వే కారిడార్ కోసం కేటాయించిన స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సైక్లింగ్ ట్రాక్ అభివృద్ధి. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా చేపట్టిన భూసేకరణలో భూములు/ స్థలాలు కోల్పోయినవారికి కొహెడ వద్ద ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు. హరితహారం ప్రాజెక్టులో భాగంగా ఈఏడాది మే 31న ప్రజలకు 50 లక్షల మొక్కలు పంపిణీ చేసేందుకు హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ ఏర్పాటు. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో వందరోజుల్లో వార్డు, ఏరియా కమిటీల ఏర్పాటు.రూ. 200 కోట్లతో 569 బీటీ రోడ్ల పనులు పూర్తి. రూ. 30 కోట్లతో మేజర్ నాలాల్లో డీసిల్టింగ్ పూర్తి.పది శ్మశానవాటికల అభివృద్ధి, ఒక్కోదానికి కోటి ఖర్చు. రూ. 3 కోట్లతో 50 బస్‌బేల అభివృద్ధి