కూచిపూడి నాకు అమ్మ ఒడి | Kuchipudi is my mother lap says venkaiah naidu | Sakshi
Sakshi News home page

కూచిపూడి నాకు అమ్మ ఒడి

Published Sat, Dec 27 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

కూచిపూడి నాకు అమ్మ ఒడి

కూచిపూడి నాకు అమ్మ ఒడి

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు
 
సిటీబ్యూరో: కూచిపూడి నాట్యం తిలకించాక అమ్మ ఒడికి చేరుకున్నంత ఆనందం కలిగిందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. నన్నయ్య నుంచి విశ్వనాథ వరకు...అన్నమయ్య నుంచి త్యాగయ్య వరకు అందరూ తెలుగువారు కావడం గర్వకారణమని, భారతీయ నాట్య రీతిలో   కూచిపూడి అద్భుతమైనదని కొనియాడారు. కూచిపూడి నుంచి తుళ్లూరు వరకు అందరినీ భాగస్వాములను చేసి ఐదోఅంతర్జాతీయ నాట్య సమ్మేళనానికి సన్నాహాలు చేయాలని కోరారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న 4వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం రెండో రోజు శనివారం సాయంత్రం జరిగిన సభలో వెంకయ్య నాయుడు ప్రసంగించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని దశదిశలా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.

ప్రపంచ మేధావుల్లో సగానికిపైగా తెలుగు వారే ఉన్నారని గుర్తు చేశారు. హిందుత్వం అంటే మతం కాదని, సంస్కృతి అని... విశ్వగురువు భారతదేశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నదని, ఉత్కృష్ఠమైన భారతీయత సంప్రదాయమే ఇందుకు కారణమని అన్నారు. ఎన్ని దాడులు జరిగినా భారతీయత చెక్కు చెదరకపోవడానికి కళలు, సంప్రదాయాలే కారణమని వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు వారు కలిసి మెలిసి ముందడుగు వేయాలని సూచించారు. పిల్లల్లో దాగి ఉన్న కళను వెలికి తీసి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ప్రభుత్వంపై ఉందన్నారు.ఈ వేడుకల్లో పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, గల్లా అరుణ కుమారి, కూచిబొట్ల ఆనంద్, ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కూచిపూడి అభివృద్ధికి రూ.100 కోట్లు

ఈ వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరాల జల్లు కురిపించారు. కూచిపూడి నాట్యం అభివృద్ధికి రూ.100 కోట్లతో ప్రాజెక్ట్ చేపడతామన్నారు. దానికి చైర్మన్‌గా కూచిభొట్ల ఆనంద్‌ను నియమిస్తానని ప్రకటించారు. అందులో నాట్య గురువులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీనికి అవసరమైన స్థలాన్ని గుర్తించాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో కూచిపూడి నృత్యాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. కూచిపూడి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఈ సమ్మేళనానికి తమ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు. 700 సంవత్సరాల కూచిపూడి నృత్యాన్ని ప్రతిబింబించేలా అంతర్జాతీయ కళా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూ.1.26 కోట్లతో కూచిపూడి గ్రామంలో మ్యూజియంు ఏర్పాటుకు తలపెట్టినట్లు చెప్పారు. వృద్ధ కళాకారుల పింఛనును రూ.500 నుంచి రూ.1500కు పెంచే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. విజయవాడలో ఘంటసాల మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, లలిత కళల అకాడమీ పునరుద్ధరణ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు.

హస్త కళలు, సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యత్నిస్తున్నామన్నారు. గుంటూరులో నృత్య పాఠశాల, కర్నూలులో నృత్య కళాశాలలకు స్థలం కేటాయిస్తామని తెలిపారు. వీటిలోని శిక్షకుల వేతనాలు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఏపీలో భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి(ఐసీసీఆర్), నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement