ఎక్కడ.. ఎవరికి.. ఎలా..!
⇒ వాహనాల స్టాంపు డ్యూటీపై గందరగోళం
⇒ ఆర్టీఏ, స్టాంప్స్‌అండ్ రిజిస్ట్రేషన్ విభాగాల మధ్య సమన్వయం కరువు
⇒ రుణప్రాతిపదికన వాహనాలు కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు
⇒ వాహనాల రిజిస్ట్రేషన్‌లలో జాప్యం
హైదరాబాద్: ఫైనాన్స్ వాహనాలపై 0.5 శాతం చొప్పున ప్రభుత్వం విధించిన స్టాంపు డ్యూటీపై గందరగోళం నెలకొంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసి నెలరోజులు గడుస్తున్నా జీవో అమలుపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు రవాణాశాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాల మధ్య సమన్వయకొరవడడంతో స్టాంపు డ్యూటీ ఎక్కడ చెల్లించాలి, ఎవరికి చెల్లించాలో తెలియని సందిగ్థత నెలకొంది. స్టాంపు డ్యూటీ చెల్లించినట్లుగా ఆధారం ఉంటే తప్ప వాహనాలు నమోదు చేయడం సాధ్యం కాదని ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు.
అయితే ఎక్కడ చెల్లించాలి, ఏ విధంగా చెల్లించాలో తెలియక వాహనదారులు అయోమయానికి లోనవుతున్నారు. వాహన రుణాలపై ఫైనాన్షియర్లు, వాహనదారులకు మధ్య కుదిరిన రుణ ఒప్పందం మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగానికి చేరేవిధంగా ప్రతి వాహనంపైన 0.5 శాతం చొప్పున స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు, సహకార సంస్థలు తదితర పెద్ద సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు సక్రమంగానే జరుగుతున్నా వందల సంఖ్యలో ఉన్న ప్రైవేట్ ఫైనాన్షియర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రభుత్వ జీవో ప్రకారం 0.5 శాతం చొప్పున ద్విచక్ర వాహనాలపైన రూ. 250 వరకు, కార్లు, ఇతర వాహనాలపైన రూ. 1500 నుంచి రూ.2500 వరకు వాహన ఖరీదు, తీసుకున్న రుణానికి అనుగుణంగా స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజూ 1000 నుంచి 1200 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతాయి. మరో 500 వాహనాలు రుణ ప్రాతిపదికన చేతులు మారుతున్నాయి. అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఫారమ్ 34 సమర్పించడానికి ముందు తప్పనిసరిగా వాహనయజమానికి, రుణదాతకు మధ్య కుదిరిన ఒప్పందంపై 0.5 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి.
అవగాహన లేమితోనే అసలు సమస్య...
- వాహనాల హైపొతికేషన్, లీజ్ అగ్రిమెంట్, తదితర అంశాలపైన కుదుర్చుకొనే ఒప్పందాలపై స్టాంపు డ్యూటీ చెల్లించాలనే అంశం మోటారు వాహన చట్టాల్లోనే ఉంది.
- బ్యాంకులు, బడా ఫైనాన్స్ సంస్థలు ఈ మేరకు ముందస్తుగానే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగానికి కొంత మొత్తాన్ని చెల్లించి ఫ్రాంకిన్ మిషన్‌లను వినియోగిస్తున్నాయి.
- ప్రైవేట్ రంగంలోని చిన్న ఫైనాన్షియర్లు జరిపే క్రయవిక్రయాల్లో ఇది వసూలు కాకపోవడంతో ప్రభుత్వం తాజా జీవోను విడుదల చేసింది.
- అయితే స్టాంపు డ్యూటీని ఆర్టీఏలో తీసుకోవడం లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ఖాతాలో జమ అయ్యేటట్లుగా ఆధారం ఉంటేనే వాహనం రిజిస్ట్రేషన్ చేస్తామని చెబుతున్నారు.
- ఈ చెల్లింపులకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఆర్టీఏ కేంద్రా ల్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు, లేదా ఈ సేవా కేంద్రాల నుంచి స్వీకరించడం వంటి ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- కొందరు ఫైనాన్షియర్‌లు ఫ్రాంకిన్ మిషన్‌లు వినియోగిస్తున్నప్పటికీ అవి ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్రతో ఉండడం వల్ల ఆర్టీఏ అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
- దీంతో వాహనాల రిజిస్ట్రేషన్‌లపైన జాప్యం నెలకొంటోంది.
- రవాణా అధికారులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌ల విభాగం అధికారులు కలిసి సమావేశమై ఒక అంగీకారానికి వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు.