లాఫింగ్ క్రైమ్స్ | Laughing Crimes | Sakshi
Sakshi News home page

లాఫింగ్ క్రైమ్స్

Published Tue, Dec 29 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

లాఫింగ్ క్రైమ్స్

లాఫింగ్ క్రైమ్స్

చెవి కొరికి జైలుకెళ్లింది ఒకరు               
‘కుక్కకూ’ పోస్టుమార్టం తప్పని వైనం
హైటెక్ సిటీలోనూ పశువుల దొంగలు     
‘జుట్టు కత్తిరింపు’ పైనా కేసు నమోదు

 
‘‘కుక్క మనిషిని కరిస్తే విషయం... మనిషి కుక్కను కరిస్తే విశేషం’’  రాజధాని నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, భారీ చోరీలు వంటి సంచలనాత్మక నేరాలు నమోదవుతూనే ఉంటాయి. వీటిని నిత్యం చూస్తూనే ఉంటాం కూడా. వీటితో పాటు అంతగా ప్రాచుర్యానికి నోచుకోని వెరైటీ క్రైమ్ కూడా నమోదు చేసుకోవాల్సిన  పరిస్థితులు పోలీసులక ఉత్పన్నమవుతుంటాయి. విధుల్లో భాగమనుకుంటూ ఇష్టంతో చేసినా... ఇదెక్కడి గోలరా బాబూ అనుకుంటూ కష్టంగా భావించినా ఈ తరహా కేసుల్నీ పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది చోటు చేసుకున్న వాటిలో ఈ కోవలోకి వచ్చే కేసుల్ని ఒక్కసారి పరిశీలిస్తే... - సాక్షి, సిటీబ్యూరో
 
కుక్కల కట్టడీ తప్పలేదు..

 బోనాలు, గణేష్ వంటి పండుగలు వస్తున్నాయంటే పోలీసులు రౌడీషీటర్లు, అసాంఘికశక్తులతో పాటు అనుమానితుల విషయంలో అప్రమత్తంగా ఉండటం తెలిసిందే. అయితే ఈసారి బక్రీద్ పండుగ నేపథ్యంలో దక్షిణ మండల పోలీసులు వీరితో పాటు గ్రామసింహాల (శునకాలు) పైనా కన్నేసి ఉంచారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపై పడే జంతు వ్యర్థాలను కుక్కలు తింటాయి. కొన్ని శునకాలు వాటిని లాక్కువెళ్లి కొంత భాగం తిని, మిగిలింది వదిలేస్తుంటాయి. అదే సమయంలో గణేష్ ఉత్సవాలు సైతం జరుగుతుండటంతో ఇలా శునకాలు జంతు వ్యర్థాలను ఆ మండపాల వద్దకు తీసుకువెళ్లి వదిలేసే ప్రమాదం ఉందని పోలీసులు భావించారు. అదే జరిగితే శాంతిభద్రతల సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో కుక్కల్నీ కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
 
పగబట్టి జుట్టు కత్తిరించింది...
వ్యక్తిగత కక్షలు, పగలు, ప్రతీకారాల కోసం కిడ్నాప్‌లు, హత్యలు, హత్యాయత్నాలతో పాటు ఆస్తుల ధ్వంసం, దగ్ధం తదితరాలు చేయడం నిత్యం జరుగుతూనే ఉంటాయి. సికింద్రాబాద్‌లోని బౌద్ధనగర్‌కు చెందిన పార్వతి మాత్రం... వ్యక్తిగత కక్షల నేపథ్యంలో సినీ ఫక్కీలో దాడి చేసి శ్రీవల్లి అనే మహిళ జుట్టు కత్తిరించేసింది. పార్వతి మరో ముగ్గురు మహిళలతో కలిసి బైక్‌లపై శ్రీవల్లి ఇంటిపై దాడి చేసింది. పథకం ప్రకారం ముగ్గురు మహిళలూ ఆమె చేతులు గట్టిగా పట్టుకోగా... పార్వతి తన వెంట తెచ్చుకున్న కత్తెరతో శ్రీవల్లి జుట్టు కత్తిరించేసింది. ‘పని’ పూర్తయ్యాక అంతే వేగంగా  బైక్‌లపై ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదుతో చిలకలగూడ పోలీసులు దాడి, జుట్టు కత్తిరింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
 
చోరుడికి పోలీసుల ‘ట్రీట్‌మెంట్’...
అనేక కేసుల దర్యాప్తులో పోలీసులు అనుమానితులు, నిందితుల్ని అదుపులోకి తీసుకుంటారు. నిజం చెప్పించడంతో పాటు రికవరీల కోసమూ వీరికి తమదైన శైలిలో ‘ట్రీట్‌మెంట్’ ఇస్తుంటారు. చిలకలగూడ పోలీసులకు మాత్రం ఓ చోరుడికి తమ పర్యవేక్షణలో ‘ఎనిమా ట్రీట్‌మెంట్’ ఇప్పించాల్సిన పరిస్థితి దాపురించింది. మైలార్‌గడ్డకు చెందిన ప్రమీల సీతాఫల్‌మండి రైల్వే ట్రాక్ పక్కన వాకింగ్ చేస్తుండగా వికాస్ అనే చోరుడు ఆమె మెడలోని గొలుసు స్నాచింగ్ చేశాడు. అనంతరం పోలీసులకు చిక్కిన అతగాడు ఆ గొలుసును మింగేశాడు. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు తమ పర్యవేక్షణలో ఎనిమా చికిత్స చేయించారు. ఎట్టకేలకు గొలుసు ‘బయటకు రావడం’తో ఊపిరిపీల్చుకుని నిందితుడిని జైలుకు పంపారు.
 
ఇదో ‘భారీ’ దొంగల ముఠా...
కేజీల బంగారం ఎత్తుకుపోలేదు... వందల సంఖ్యలో వజ్రాలూ దోచేయలేదు... రూ.కోట్లలో నగదునూ కొల్లగొట్టలేదు... అయినప్పటికీ ఆ గ్యాంగ్‌లోని వారు మాత్రం ‘భారీ’ చోరులుగానే రికార్డులకెక్కారు. షేక్ అబ్దుల్ కరీం, మహ్మద్ ముజాహిద్ ఏకంగా క్రేన్లు వినియోగించి భూగర్భంలో వేసే కేబుళ్లను చోరీ చేస్తూ సైదాబాద్ పోలీసులకు చిక్కారు. చార్మినార్, బంజారాహిల్స్, మాదాపూర్, సైదాబాద్ ప్రాంతాల్లో డీసీఎం వ్యాన్లలో సంచరిస్తూ కనిపించిన కేబుల్ వైర్ డ్రమ్ముల్ని ఎంపిక చేసుకునే వారు. అదును చూసుకుని క్రేన్‌తో సహా వచ్చి వాటిని తస్కరించుకుపోయేవారు. సైదాబాద్ లక్మీనగర్ సబ్-స్టేషన్ పరిధిలో ఏకంగా 13 టన్నుల కేబుల్ వైర్ డ్రమ్ముల్ని ఎత్తుకుపోయారు. ఎట్టకేలకు సైదాబాద్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. పోలీసులు వీరి వద్ద నుంచి చోరీ సొత్తుతో పాటు అందుకు వినియోగించిన హైడ్రాలిక్ క్రేన్‌నూ స్వాధీనం చేసుకున్నారు.
 
రెండో‘సారీ’... చోరీ...
పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదనే విషయం ఆ దొంగకు బాగా తలకెక్కినట్లుంది. అయితే అతడి పశ్చాత్తాపంలోనూ ఓ చిన్న మెలిక ఉంది. నేరాలు మానడానికి బదులు ఆ ఇంటి వారికి ‘లిఖితపూర్వకంగా’ క్షమాపణలు చెప్పి ఉన్నదంతా ఊడ్చుకుపోయాడు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని బీఎన్‌రెడ్డి కాలనీలో వ్యాపారి ప్రదీప్ దంపతులు ఉంటున్నారు. అక్టోబర్‌లో వీరింట్లోకి జోరబడిన దొంగ బీరువాలోని విలువైన వస్తువులు ‘సర్దేశాడు’. వెళ్తూ వెళ్తూ గోడపై ‘సారీ’ అంటూ రాసిపోయాడు. నవంబర్‌లో మళ్లీ అదే ఇంట్లో చేతివాటం చూపించిన నేరగాడు మొదటిసారి రాసిన చోటే మళ్లీ ‘సారీ’ రాసి ఉడాయించాడు. చేతి రాతను సరిచూసిన పోలీసులు రెండు చోరీలు ఒకే దొంగ పనిగా తేల్చారు.
 
‘లైక్స్’ కోసం యత్నించి  జైల్లో ‘ల్యాండ్’...

పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి... అంటే ఇదేనేమో. ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన ఫజల్ షేక్ జూకు వెళ్లి, జంతువులకు అతి దగ్గరగా ఫొటోలు దిగాలని ఆశపడ్డాడు. వీటిని ఫేస్‌బుక్‌లో పెట్టి ఎక్కువ లైక్స్ పొందాలని ప్రయత్నించాడు. ఇతడు అనుసరించిన పంథా బెడిసికొట్టడంతో నేరుగా జైల్లో ‘ల్యాండ్’ అయ్యాడు. ఇతగాడు జంతువులకు దగ్గర నుంచి ఫొటోలు దిగటంతో ఆగకుండా మరో అడుగు ముందుకు వేసి తాబేళ్ల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. ఓ తాబేలు పైకి ఎక్కి నిల్చుని మరీ ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలతో గుర్తింపు పొందేందుకు వాటిని ఫేస్‌బుక్‌లోని అప్‌లోడ్ చేసి ‘బుక్కైపోయాడు’. ఇవి ఫేస్‌బుక్‌తో ఆగకుండా ఇతర సోషల్‌మీడియాలతో పాటు మీడియాలోనూ హల్‌చల్ చేయడంతో జూ అధికారులు బహదూర్‌పుర ఠాణా తలుపుతట్టారు. సీన్ కట్ చేస్తే ఫజల్ షేక్ జైలుకు చేరాడు.
 
వేధింపుల కోసం ‘చోరీలు’...
డబ్బు సంపాదించడానికో, అవసరాలు తీర్చుకోవడానికో సెల్‌ఫోన్లు చోరీ చేసే వాళ్లను తరచుగా చూస్తూనే ఉంటాం. బాలానగర్‌కు చెందిన బ్రహ్మయ్య నైజం దీనికి విరుద్ధం. భార్యపై ఉన్న కోపంతో మహిళల్ని వేధించడానికే ఇతడు సెల్‌ఫోన్లు చేరీ చేస్తూ చిక్కాడు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇతగాడు ఫిరోజ్‌గూడలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలి మహిళలపై కక్ష కట్టాడు. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో
 
తిరుగుతూ...
ఇళ్లల్లో సెల్‌ఫోన్లు చోరీ చేయడం ప్రారంభించాడు. ఆ ఫోన్లలో ఉన్న మహిళల నెంబర్లకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడి వేధించేవాడు.  ఇలా రెచ్చిపోతున్న  ఈ బ్రహ్మయ్య ఓ మహిళ ఇచ్చిన  ఫిర్యాదుతో పోలీసులకు చిక్కి జైలుకెళ్లాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement