ఒక కత్తి ఎన్ని అంగుళాల పొడవు? అది గొంతు మీద ఏర్పరిచే అడ్డు గీత ఎన్ని అంగుళాల పొడవు? ఒక దురాలోచన ఎన్ని అంగుళాల పొడవు?చట్టం నుంచి పారిపోయే దూరం ఎన్ని అంగుళాల పొడవు.
రెండు అంగుళాల వెడల్పు, మూడు అంగుళాల వెడల్పు ఉన్న ఒక చిన్న క్లూ నిందితుణ్ణి పట్టిచ్చింది. అంగుళం కూడా కదలనివ్వక జైల్లో కూర్చోబెట్టింది.
ఇంట్లో అంగుళం అంగుళం క్షుణ్ణంగా పరిశీలించింది స్క్వాడ్ బృందం. రోజంతా పట్టింది. కానీ, ఎలాంటి ఆధారమూ దొరకలేదు. సోఫాలు జరుపుతూ ఉంటే కొన్ని విజిటింగ్ కార్డ్స్ కింద పడి కనిపించాయి. దూరంగా మరో కార్డ్ పడి ఉంది.
2004. డిసెంబర్ నెల చలి ఎక్కువగా ఉండటం వల్ల ఉదయం పది గంటల ప్రాంతంలో కూడా చల్లగా ఉంది. సూర్యుడు రాలేదు. వెలుతురు తక్కువగా ఉంది. కానీ ఇదేమీ పట్టని టెలిఫోన్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో అదే పనిగా మోగుతోంది. ఆఫీసర్ ఎత్తి ‘హలో’ అన్నాడు. అవతలి వైపు ఎవరో ‘సార్.. సార్’ అన్నారు.ఆఫీసర్ అలర్ట్ అయ్యాడు.‘కంగారు పడకుండా చెప్పండి’ ‘సార్... మరి.. మా యజమాని గారిని, వంటవాణ్ని ఎవరో చంపేశారు సార్’ కంగారుగా చెప్పాడు ఆ వ్యక్తి.
ఖరీదైన ఆ అపార్ట్‌మెంట్ మీద ఎండ పలుచగా కాస్తూ ఉంది.ఆఫీసర్ తన సిబ్బందితో దిగాడు.సెక్యూరిటీ దగ్గరే ఫోన్ చేసిన వ్యక్తి కాచుకుని ఉన్నాడు.అతడు ఫ్లాట్ ఓనర్ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. పేరు అస్ఘర్.‘రండి సార్ వెళదాం’ అని లిఫ్ట్‌లో తీసుకెళ్లాడు.అడుగుపెడుతూనే తెలుస్తూ ఉంది అది ఖరీదైనవాళ్ల అపార్ట్‌మెంట్ అని.లోపల రెండు శవాలు పడి ఉన్నాయి. ఒకటి యజమానిది. రెండవది వంటతనిది. గొంతు కోసి పడేశారు. ఒక సూట్ కేస్ తెరిచి ఉంది. అంటే డబ్బు కాజేసి ఉండాలి. కింద కారు కూడా లేదని డ్రైవర్ చెప్పాడు. అంటే దోపిడీ దొంగల పని అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.హత్యకు గురైన వ్యక్తి పేరు రవికుమార్ (పేరు మార్చాం). పారిశ్రామికవేత్త. ఓ స్టీల్ కంపెనీ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. భార్యాపిల్లలు ఢిల్లీలో ఉంటున్నారు. అంత విశాలంగా ఉన్న ఆ ఇంట్లో యజమాని, వంటవాడు ఇద్దరే ఉంటారని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ‘లిఫ్ట్ ఆపరేటర్, వాచ్‌మన్, డ్రైవర్‌లను పట్టుకురండి’ అని పోలీసులను పంపించాడు ఆఫీసర్. వాళ్లను ఎన్నివిధాలుగా ప్రశ్నించినా ఏమీ తేలలేదు.మృతదేహాలను పోస్ట్‌మార్టంకి తరలించి, ఇంటికి సీల్ వేశారు. రవికుమార్ ఇటీవలే రెండు కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ డీల్ చేశాడని తెలిసింది. ఆ డబ్బు కోసం ఎవరైనా ఈ పని చేశారా? దోపిడీ దొంగలకు ఆ సమాచారం ఎవరు ఇచ్చి ఉంటారు? ఎంత విచారించినా ఏమీ తేలలేదు.
ఢిల్లీ నుంచి కుటుంబ సభ్యులు వచ్చారు. వారూ ఎవరి మీదా అనుమానం వ్యక్తం చేయలేదు. ఆరు నెలలు గడిచిపోయాయి. రవికుమార్ కుటుంబం ఢిల్లీ నుంచి హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌కి తరచూ వస్తూనే ఉంది. తమ కుటుంబ పెద్దను చంపిందెవరో తెలుసుకోమని అధికారులను కోరుతూనే ఉంది. అంతే కాదు ప్రెస్‌మీట్ కూడా పెట్టేసరికి డిపార్ట్‌మెంట్ మీద ఒత్తిడి పెరిగింది.దీంతో కేసు సీసీఎస్ పోలీసుల అధీనంలోకి వెళ్లింది. కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు సీసీఎస్ పోలీసులు.
సీజ్ చేసి ఉంచిన ఘటనా స్థలిని పరిశీలించడానికి ఓ టీమ్ వెళ్లింది. పటాన్‌చెరులోని ఫ్యాక్టరీ వద్ద ఆరా తీయడానికి మరో టీమ్ బయల్దేరింది. ఇంట్లో అంగుళం అంగుళం క్షుణ్ణంగా పరిశీలించింది స్క్వాడ్ బృందం. రోజంతా పట్టింది. కానీ, ఎలాంటి ఆధారమూ దొరకలేదు. సోఫాలు జరుపుతూ ఉంటే కొన్ని విజిటింగ్ కార్డ్స్ కింద పడి కనిపించాయి. దూరంగా మరో కార్డ్ పడి ఉంది. టీమ్ మెంబర్ ఆ కార్డ్స్ చూశాడు. అన్నీ బిజినెస్ కార్డ్స్. వ్యాపారవేత్తల ఇళ్లలో అలాంటి విజిటింగ్ కార్డ్స్ సాధారణమే. టీమ్ మెంబర్ అక్కడి నుంచి వెళ్లిపోబోయి మూలన పడి ఉన్న కార్డును చేతుల్లోకి తీసుకున్నాడు. దాని మీద చందానగర్‌లోని ఓ చిన్న లాడ్జి పేరు ఉంది. సంపన్నుడైన రవి కుమార్ ఇంట్లో ఇలాంటి చీప్ లాడ్జికి చెందిన విజిటింగ్ కార్డు ఉండటమేంటి?! విజిటింగ్ కార్డ్. రెండు అంగుళాల వెడల్పు మూడు అంగుళాల పొడవు ఉన్న కార్డ్.
ఈ విజిటింగ్ కార్డే ఈ కేసులో ముఖ్యమైన క్లూనా? వెంటనే చందానగర్‌లోని ఆ లాడ్జికి పోలీసు వాహనాలు బయల్దేరాయి.
లాడ్జికి వెళ్లిన బృందం ఘటన జరిగిన డిసెంబర్ 23కి వారం ముందు, తర్వాత ఎవరెవరు బస చేశారో వివరాలు తీశారు.రెండు పేజీల అవతల ‘రవి స్టీల్ ఇండస్ట్రీస్ డ్రైవర్ గిరిరాజ్, అతడి స్నేహితులు’ అని ఉంది.గిరిరాజ్ ఎవరు? కూపీ లాగారు.అతడు రవి కుమార్‌కు నమ్మినబంటు. ఫ్యాక్టరీ డ్రైవర్. అతణ్ణి ఎలా అనుమానించాలి? అయినా సరే వెంటనే గిరిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాని అతడు ఫోన్ చేసే సరికి ఢిల్లీలో ఉన్న రవికుమార్ కుటుంబీకులు హుటాహుటిన వచ్చి పోలీసులకు ఎదురు తిరిగారు. ‘ఇతను ఇక్కడే ఉండి మా మంచి చెడ్డ చూస్తున్న వ్యక్తి. ఎన్నాళ్లుగానో మా కుటుంబసభ్యుల్లో ఒకడిగా కలిసిపోయాడు. ఇతన్ని మీరెందుకు అరెస్టు చేస్తున్నారు’ అని అడిగారు. కాని పోలీసులు వినలేదు.గిరిరాజ్ నుంచి నిజం కక్కించారు.
రవి స్టీల్ ఇండస్ట్రీస్‌లో డ్రైవర్‌గా పని చేసే హరియాణా వాసి గిరిరాజ్. పనుల నిమిత్తం తరచు ఇంటికి వస్తుండే గిరిరాజ్‌కు అస్ఘర్ లీవ్ పెట్టినప్పుడల్లా డ్రైవర్ బాధ్యతలను అప్పజెప్పేవాడు రవి కుమార్. యజమాని కుటుంబం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా వారికీ డ్రైవర్‌గా పని చేస్తూ పరిచయం పెంచుకున్నాడు. ఈ సమయంలోనే రవికుమార్ రియల్ ఎస్టేట్‌లో భాగంగా శంషాబాద్‌లో భూమి అమ్మి రూ. 2 కోట్లకు పైగా డబ్బు ఇంట్లో పెట్టుకోవడం గిరిరాజ్ దృష్టిలో పడింది. వెంటనే హరియాణా నుంచి నలుగురు స్నేహితులను రప్పించాడు. వీరిని చందానగర్‌లోని ఓ లాడ్జిలో ఉంచి అదును కోసం ఎదురు చూశాడు. 2004 డిసెంబర్ 22. ఆ రోజు రాత్రి పదిన్నరకు రవి కుమార్‌ని ఇంట్లో దించిన డ్రైవర్ అస్ఘర్ కారును సెల్లార్‌లో పార్క్ చేసి, వెళ్లిపోయాడు. 11 గంటల సమయంలో అనుచరులతో కలిసి రవికుమార్ ఫ్లాట్‌కు వచ్చాడు గిరిరాజ . తలుపు కొట్టడంతో వంట మనిషి సంపత్‌రావు ఓపెన్ చేశాడు.
ఒక్కసారిగా ఐదుగురూ లోనికి ప్రవేశించడంతో షాక్‌కు లోనయ్యాడు. తేరుకునేలోపే కత్తులతో బెదిరిస్తూ దుండగులు హాల్‌లోకి ప్రవేశించారు. సోఫాలో రిలాక్స్‌డ్‌గా టీవీ చూస్తున్న రవికుమార్ దుండగులను చూడటంతోనే పరిగెత్తబోయాడు. కాని వారు అతని మీద దాడి చేసి గొంతు కోసేశారు. షాక్‌లో ఉన్న సంపత్ రావు కంఠాన్నీ కర్కశంగా కోసేశారు. గొంతు తెగి తీవ్రరక్త స్రావం అవుతున్న రవికుమార్‌ని దుండగులు హాల్ నుంచి బెడ్‌రూమ్ వరకు లాక్కువెళ్లారు. అక్కడి లెదర్ సూట్‌కేసులో 35 లక్షలు ఉన్నాయి. వాటిని తీసుకుని దోపిడి దొంగల మీద అనుమానం రావడానికి రవికుమార్‌కి చెందిన స్కోడా కారు కూడా తీసుకువెళ్లారు. కారును శివార్లలో విడిచిపెట్టేసి డబ్బుతో హరియాణా పారిపోయారు. గిరిరాజ్ మాత్రం ఆ డబ్బులో నుంచి రూ.10 వేలు తీసుకుని ఏమీ ఎరుగనట్లు రూమ్‌కు వెళ్లిపోయాడు. మిగిలిన డబ్బు తర్వాత తీసుకోవాలని అతని ప్లాన్. కాని చివరకు ఆ పది వేలే అతనికి మిగిలాయి. పదివేల మొత్తానికి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు గిరిరాజ్.నేరం నిరూపణ కావడంతో కోర్టు ముద్దాయిలకు జీవితఖైదు విధించింది. నమ్మిన కుటుంబాన్ని వంచించి, ఆధారాలేవీ లేవని నిబ్బరంగా ఉన్న గిరిరాజ్‌ను ఓ చిన్న విజిటింగ్ కార్డ్ పట్టించింది. నేరస్తులు ఎంత గొప్పగా పథకాలు వేసినా తప్పించుకోలేరని మరోసారి రుజువైంది.
– శ్రీరంగం కామేశ్
Comments
Please login to add a commentAdd a comment