![Gangster Munna Bajrangi shot dead in Baghpat jail - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/10/murder.jpg.webp?itok=z-aGRdjE)
మున్నా బజరంగీ
బాగ్‌పట్: ఉత్తరప్రదేశ్‌లోని ఓ జైలులో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఓ గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో మృతి చెందింది అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ మున్నా బజరంగీ అలియాస్ ప్రేమ్ ప్రకాశ్ సింగ్(51). 2017లో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యేను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసుకు సంబంధించి కోర్టులో ప్రవేశపెట్టేందుకు గాను బజరంగీని ఆదివారమే ఝాన్సీ జైలు నుంచి బాగ్‌పట్ జైలుకు తీసుకువచ్చారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో జైల్లో తన గదిలోనే ఉంటున్న మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతీతో గోడవ జరిగిందని.. ఈ క్రమంలో బజరంగీపై సునీల్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
దీంతో బజరంగీ అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. బజరంగీపై ఒకటి కంటే ఎక్కువ సార్లు తుపాకీతో సునీల్ కాల్పులు జరిపాడని.. అనంతరం తుపాకీని మురుగుకాలువలో విసిరేశాడని బాగ్‌పట్ ఎస్పీ జయప్రకాశ్ వెల్లడించారు. తుపాకీ జైలులోకి ఎలా వచ్చిందన్న దానిపైనా విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. దర్యాప్తుకు ఆదేశించారు. అలాగే ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. గత నెలలో బజరంగీ భార్య సీమా సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. తన భర్తను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే ఈ క్రమంలోనే బజరంగీ హత్యకు గురి కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment