సాక్షి, హైదరాబాద్: మూడేళ్లు, ఐదేళ్ల లాసెట్, పీజీ లాసెట్ కోసం వచ్చే నెల 4 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాలని లాసెట్ కమిటీ నిర్ణయించింది. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 28న జారీ చేయనుంది. లాసెట్ కోసం ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.350 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మూడేళ్లు, ఐదేళ్ల లాసెట్ మే 27న ఉదయం 10 గంటలకు, పీజీ లాసెట్ అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఉంటుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మూడేళ్ల లా కోర్సుకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించినట్లు కమిటీ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5ఏళ్ల సడలింపు ఉంటుంది. ఐదేళ్ల లా కోర్సుకు గరిష్ట వయోపరిమితి 20 ఏళ్లుగా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, లాసెట్ చైర్మన్, కేయూ వీసీ సాయన్న, కన్వీనర్ ఎంవీ రంగారావు పాల్గొన్నారు.
మార్చి 4 నుంచి లాసెట్ దరఖాస్తులు
Published Tue, Feb 21 2017 2:57 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM
Advertisement